YS Sharmila: వైఎస్సార్ టీపీ అధికారంలోకి వస్తే ఆ ఫైలుపైనే తొలి సంతకం - వైఎస్ షర్మిల
YS Sharmila Praja Prasthanam Padayatra: రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంట్, ఉద్యోగాలు, సున్నా వడ్డీకే రుణాలు, దళితులకు మూడు ఎకరాల భూమి, పోడు పట్టాల పంపిణీ జరగలేదని కేసీఆర్ పాలపై షర్మిల విమర్శలు గుప్పించారు.
YS Sharmila Praja Prasthanam Padayatra వరంగల్ : బంగారు పళ్ళెంలో రాష్ట్రాన్ని అప్పగిస్తే 9 ఏళ్లలో 4.80 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి పెట్టారని.. ఇన్ని అప్పులు చేసి ఏ కుటుంబానికి న్యాయం చేయని సీఎం కేసీఆర్ 420 అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ద్వజమెత్తారు. దొర ఎన్నికలు ఉంటేనే బయటకు వస్తాడని.. లేకుంటే ఫామ్ హౌజ్ కి పరిమితం అవుతారని అన్నారు. కేసీఆర్ అధికారంలో వచ్చిన రెండు పర్యాయాలు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని.. లక్ష లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 231వ రోజు జనగాం జిల్లాలో కొనసాగింది. మధ్యాహ్నం 3.30గంటలకు స్టేషన్ ఘనపూర్ నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన షర్మిల ఘనపూర్ మండల పరిధిలోని చాగల్,శివారెడ్డి పల్లి, రాఘవపూర్, రఘునాథ్ పల్లి మండల పరిధిలోని గోవర్ధనగిరి, కొమ్మాల మీదుగా 12 కిలోమీటర్ల పాటు సాగింది.అడుగడుగునా వైఎస్ షర్మిల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అందడం లేదని, తాము ఎలా బ్రతుకుతున్నమో కూడా పట్టించుకొనే వాళ్ళు లేరు అంటూ షర్మిల దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు.
అధికారంలోకి వస్తే తొలి సంతకం అదే..
YSR తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదే ఉంటుందని.. ఇళ్లులేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని షర్మిల హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది వృద్ధులు ఉంటే అందరికీ 3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ తో పాటు, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి పూర్వ వైభవం తెస్తామని.. గతంలో వైఎస్సార్ అమలుచేసిన ప్రతి పథకం అద్భుతంగా అమలు చేసి చూపిస్తామని మాట ఇచ్చారు. కొమ్మాల టోల్ గేట్ దాటిన అనంతరం నేడు రాత్రికి అక్కడే బస చేయనున్న షర్మిల.. శుక్రవారం ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 10న రఘునాథ్ పల్లి, దాసన్నగుడెం, ఖిలా షాపూర్, మక్కలగట్టు మీదుగా జనగాం నియోజక వర్గంలో అడుగు పెట్టనున్నారు.
కేసీఆర్ మోసాల చిట్ట చదివితే తెల్లారుతుందని ఎద్దేవా..
రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంట్, ఉద్యోగాలు, సున్నా వడ్డీకే రుణాలు, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, పోడు పట్టాల పంపిణీ ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసాల చిట్ట తెల్లారుతుందని షర్మిల ఎద్దేవా చేశారు. రుణమాఫీ కాక బ్యాంకుల వద్ద 16 లక్షల మంది రైతులు డీ ఫాల్టర్లు గా మారారని.. ఉద్యోగాలు అని చెప్పి 65 వేల ఉద్యోగాలు కూడా నింపలేక పోయారని.. దీంతో రాష్ట్రంలో 8 వేల మంది రైతులతో పాటు వందలాదిగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి బార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణ గా మార్చారని.. అప్పుల తెలంగాణ - ఆత్మహత్యల తెలంగాణగా మారిందని అన్నారు.
"ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. సీఎం కేసీఆర్ మళ్ళీ వచ్చి పిట్ట కథలు చెప్తాడు. ఇప్పుడు దళిత బంధు అని చెప్పి మోసం చేస్తున్నాడు. ఈ సారి బిసి బంధు అంటాడు. ఎస్టీ బంధు అంటాడు. ఆకాశంలో చందమామ కిందకు దించుత అంటాడు. మళ్ళీ మళ్ళీ కేసీఆర్ మాటలు నమ్మితే మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరు. ఈ సారి కెసిఆర్ వస్తె కర్రు కాల్చి వాత పెట్టండి. మీకోసం పాటు పడే వైఎస్సార్ తెలంగాణ పార్టీకి అవకాశం ఇవ్వండి " అని షర్మిల అన్నారు.