Warangal News: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై రాజకీయ రగడ - ఇక కలగానే మిగులనుందా?
Warangal News: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ఇరు పక్షాల వారు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.
Warangal News: రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. బీజేపీని ఇరుకున పెట్టడానికి ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు బీఆర్ఎస్ నాయకులు. సౌత్ సెంట్రల్ రైల్వేలోని కీలక జంక్షన్లలో ఒకటి కాజీపేట రైల్వే జంక్షన్. ఈ జంక్షన్ కేంద్రంగా వరంగల్ లో ప్రస్తుతం రాజకీయ రగడ మొదలైంది. కొన్నేళ్ల క్రితం కాజీపేటకు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మరో రాష్ట్రానికి తరలిపోయింది. ఆ తరువాత వచ్చిన వ్యాగన్ వీల్ తయారీ కేంద్రం కూడా రాజకీయ కారణాలతో మరో చోటుకు తరలించారు. ప్రస్తుతం కాజీపేటకు పీవోహెచ్ వర్క్ షాప్ మంజూరై టెండర్లు కూడా పూర్తయ్యాయి. కానీ పనులు మొదలు కావడంపై మాత్రం రాజకీయ కొట్లాట నడుస్తోంది.
బీఆర్ఎస్ నేతల నిరసనల పర్వం..
కేంద్రంలోని బీజేపీ కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కేటాయించాలంటూ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నిరసనల పర్వం కొనసాగిస్తున్నారు. విభజన హామీల్లోని కోచ్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదని బీజేపీని ఎండగడుతున్నారు. కోచ్ ఫ్యాక్టరీ పేరుతో స్థానిక బీజేపీ నేతలపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి బీజేపీ నేతలు కేంద్రం చెప్పిన విధివిధానాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కోచ్ ఫ్యాక్టరీ తరలిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ వీల్ పరిశ్రమలు ఇప్పటికే రాష్ట్రం దాటిపోగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2016లో కేంద్ర ప్రభుత్వం రూ.383 కోట్లతో మరో రైల్వే ప్రాజెక్టు పీవోహెచ్ను కాజీపేటకు మంజూరు చేసింది. ఈ వర్క్ షాపునైనా ప్రారంభిస్తే తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రాజెక్టు మంజూరై ఆరేళ్లు గడుస్తున్నా వర్క్ షాపు పనులు మాత్రం ఇంత వరకు పట్టాలెక్కలేదు. పీవోహెచ్ ఏర్పాటుకు 160 ఎకరాల స్థలం కావాల్సి ఉండగా.. 158.17 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు మూడు విడతల్లో అప్పగించింది. మరో ఎకరానికి పైగా స్థలాన్ని సేకరించి ఇవ్వాల్సి ఉంది. రైల్వేశాఖకు అందించిన స్థలానికి రహదారి నుంచి దారి లేకపోవడంతోనే ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. అయితే దారి కోసం అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు యజమాని సిద్ధంగా ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కోచ్ ఫ్యాక్టరీ.. బీజేపీ ఎదురు దాడి
పీవోహెచ్ పనులు ప్రారంభమైతే బీజేపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అడ్డుపడుతూ.. ఎప్పుడో తరలిపోయిన కోచ్ ఫ్యాక్టరీ పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నాడని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సైతం నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి తీసుకెళ్తుండటంతో వరంగల్ ప్రజలు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీ నినాదం వదిలి యువతకు ఉపాధినిచ్చే పీవోహెచ్ వర్క్ షాపు పనులు ప్రారంభించి చిత్తశుద్ధి చాటుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ లేని కోచ్ ఫ్యాక్టరీ పేరుతో బీజేపీని ఇరుకున పెట్టాలని ఎమ్మెల్యే వినయ్ భాస్కరే పీవోహెచ్ పనులకు అడ్డుపడుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. పీవోహెచ్ వర్క్ షాపు దారి కోసం బడ్జెట్ కూడా అందుబాటులో ఉంది. అవసరమైన స్థలాన్ని సేకరించి వర్క్ షాపు ప్రారంభానికి వినయ్ భాస్కర్ బాటలు వేస్తారో.. లేదా ఉపాధినిచ్చే ప్రాజెక్టును రాజకీయ వివాదంలో చిక్కుకుని మరో చోటుకు తరలిపోతుందేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.