KTR At KITS: త్రీ 'ఐ' నినాదంతో ఫస్ట్ క్లాస్ కంట్రీగా భారత్ ఎదుగుదల: మంత్రి కేటీఆర్
త్రీ 'ఐ'నినాదంతో ప్రపంచంలో అభివృద్ధి చెందిన ప్రథమ శ్రేణి దేశాల జాబితాలో భారత్ ఆవిర్భవిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
- ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ లక్ష్యంగా పని చేయాలి
- యువత వైఫల్యాలను సెలబ్రెట్ చేసుకోవాలి
- జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ క్రియేటర్స్ గా యువత ఎదగాలి
- యువ ఔత్సాహిక వేత్తలకు సంపూర్ణ మద్దతు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దం
- జపాన్, చైనా దేశాల్లో వచ్చిన స్పూర్తి మన దగ్గర కూడా రావాలి
- కిట్స్ కాలేజి లో ఏఐసిసీటీఈ ఐడియా ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హన్మకొండ/ కిట్స్ కాలేజ్ క్యాంపస్: త్రీ 'ఐ'నినాదంతో ప్రపంచంలో అభివృద్ధి చెందిన ప్రథమ శ్రేణి దేశాల జాబితాలో భారత్ ఆవిర్భవిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ లోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో కోటి 26 లక్షల వ్యయంతో ఏఐసిసీటీఈ ఐడియా ల్యాబ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శాసనసభ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో వినూత్న ఆవిష్కరణల గురించి మంత్రి కేటీఆర్ చర్చించారు.
అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం లభించి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల పై దేశంలో అన్ని రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో తనకు పాల్గొనే అవకాశం వచ్చిందన్నారు. పెద్దపెద్ద నాయకులు ముఖ్యమంత్రులు తర్వాత తనకు ఇచ్చిన సమయంలో త్రి 'ఐ' నినాదంతో దేశం ఫస్ట్ వరల్డ్ దేశం అవుతుందని , ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసానని మంత్రి తెలిపారు.
1997 సంవత్సరంలో తాను ఉన్నత విద్యల కోసం అమెరికా వెళ్లడం జరిగిందని, అక్కడి ప్రజల ఆలోచన విధానం, మౌలిక వసతులు దేశ అభివృద్ధికి అనుసరిస్తున్న పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రముఖ అమెరికా అధ్యక్షుడు జోనఫ్ కేనాడీ America doesn't have good highways because it is rich country, America is rich country because it has good highways అన్నారని, దేశంలో ఉన్న మౌలిక వసతులతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందని, త్రాగునీరు సాగునీరు రోడ్లు గ్రామీణ ప్రాంతాలలో వసతులు పట్టణ ప్రాంతాలలో వసతులు కోట్లు రైల్వే విద్యుత్ సౌకర్యం వంటి పలు రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో అత్యుత్తమమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన మేర పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని దీనికి అవసరమైతే అప్పులు చేయడంలో తప్పు లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. మన తల్లిదండ్రులు ఉద్యోగంలో చేరిన తర్వాత డబ్బు జమ చేసి రిటైర్మెంట్ వయసులో ఇల్లు కొనుక్కోవాలని లక్ష్యంతో ఉండేవారని, ప్రస్తుత జనరేషన్ ఉద్యోగంలో చేరిన వెంటనే తమ వద్ద ఉన్న నైపుణ్యాల పై నమ్మకంతో ఈఎంఐ పద్దతీలో ఇండ్లు, కార్లు కొనుగోలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలలో మార్పు ఆశించిన స్థాయిలో రాలేదని, మన దేశ ఆర్థిక విధానాలు మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
సాంకేతికత వినియోగిస్తూ చేసేది మాత్రమే ఇన్నోవేషన్ కాదని, మన నిత్య జీవితంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఇన్నోవేషన్ ఉపయోగించాలని, ప్రతి రంగంలో ఇన్నోవేషన్ అవసరం అవుతుందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ఆలోచించి నూతన పంచాయతీ రాజ్ చట్టం నూతన మున్సిపల్ చట్టం, టీఎస్ బీపాస్ , టీఎస్ ఐపాస్ వంటి పాలసీలను రూపొందించిందని , 20 రోజులలో భవన నిర్మాణ అనుమతులు, 15 రోజులలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, 85% మేర మొక్కల సంరక్షణ వంటివి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఇన్నోవేషన్ పాలసీల కారణంగా వచ్చాయని కేటీఆర్ తెలిపారు.
దేశంలో ఒక నగరం, ప్రాంతం బాగుపడితే సరిపోదని, అభివృద్ధి ఫలితాలు ప్రతి ఒక్కరికి లభించాలని, దీనినే ఇంక్లూజివ్ గ్రోత్ అంటామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ తో పాటు ద్వితీయ శ్రేణి వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకు సైతం ఐటీ విస్తరణ కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. కరోనా అనంతరం ఇంటి వద్ద నుంచి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను నడిపాయని, తమిళనాడు కు చెందిన జోహో అనే సంస్థ కార్యాలయం లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి నైపుణ్యం కల్గిన యువకులను నియమించుకోని సేవలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు.
త్రీ ఐ నినాదం ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని, విద్యార్థులు పాసైన తరువాత ఔత్సాహిక వేత్తలుగా ఎదిగేందుకు రిస్క్ తీసుకోవాలని మంత్రి కోరారు. ప్రపంచంలో మేటి కంపెనీలకు భారతీయులు సత్యనాథెల్లా, సుందర్ పిచ్చై, లీనా నాయర్, శాంతనా నారాయణ్, లక్ష్మీ నారాయణ్ వంటి అనేక మంది సీఈఓ గా ఉన్నారని, వీళ్ళంతా మన భారతదేశంలో చదువుకోని ఇతరులు స్థాపించిన ప్రఖ్యాతి గాంచిన సంస్థలో అగ్రస్థానానికి ఎదిగారని, మన భారత దేశం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పోందిన సంస్థ మాత్రం లేదనేది కఠిన వాస్తవమని మంత్రి అన్నారు.
మన చుట్టుపక్కల మనం వాడే వస్తువులలో అత్యథికం ఇతర దేశాల కంపెనీలకు చెందినవి మాత్రమేనని అన్నారు. జపాన్ దేశంలో 15% మాత్రమే భూ భాగం నివాసయోగ్యంగా ఉంటుందని, వనరులు లేకపోయినా, ప్రకృతి వైపరిత్యాలు నిరంతరం సంభవించినా, న్యూ క్లియర్ దాడులు జరిగినప్పటికీ అక్కడ ప్రజలు మానవ మేధస్సు పెట్టుబడిగా ప్రపంచంలోనే 3వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగారని అన్నారు.
1987 నాటికి భారత దేశం, చైనా ఆర్థికంగా ఒకే స్థాయిలో ఉన్నాయని, చైనా దేశంలో అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజలు చిత్తశుద్ధితో పని చేయడం వల్ల నేడు చైనా జి.డి.పి 18 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక శక్తిగా అంటే మనకంటే 6 రెట్లు పెద్ద శక్తిగా ఎదిగిందని మంత్రి తెలిపారు. చైనా ప్రపంచంలో ఉన్న అగ్రగామి దేశాలైన అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్ దేశాలతో పోటిపడ్డాయని, భారతదేశం పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తో పోల్చుకుంటూ, పక్కన వాడి ఏం తింటున్నాడు, ఏం కులం, ఏం మతం, ఏం ధరించాడు అని ఆలోచిస్తూ వెనుకపడ్డామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు
చైనా, జపాన్ దేశాల స్పూర్తితో కనీసం భవిష్యత్తు తరాలు విద్వేషాలు వదిలిపెట్టి, అనవసర అంశాల పై కాకుండా దేశ అభివృద్ధి కోసం మహాకవి శ్రీశ్రీ చేసినట్లు నేను సైతం (ప్రపంచం) దేశ అభివృద్ధికి కృషి చేయాలనే భావన అందరికి రావాలని మంత్రి కోరారు. యువత Job Seeker గా కాకుండా Job Creator గా తయారు కావాలని, ఔత్సాహిక వేత్తలుగా ప్రారంభంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికి చాలా నేర్చుకునే అవకాశం లభిస్తుందని, యువతకు అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్, టీ వర్క్స్, రిచ్, వీ హబ్, టిఎస్ఐఎస్సి లను ఏర్పాటు చేసిందని తెలిపారు
హుస్నాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే సతీష్.. మహేందర్ అనే వ్యక్తి పరిచయం చేసారని, మార్కెట్ లో 1.6 లక్షల విలువ గల రోటోవేటర్ ను ఆయన 70 వేలితో తయారు చేశారని, అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో వైష్ణవి అనే చిన్నారి 9వ తరగతి చదువుతుందని , తండ్రి ఆరోగ్యం బాగా లేదని, ఆమె సిలిండర్ ను రెండవ ఫ్లోర్ కు తీసుకెళ్ళెందుకు ఒక లివర్ తయారు చేసిందని, ఈ విధంగా మన చుట్టుపక్కల ఉన్న సమస్యల పరిష్కారం దిశగా ఆలోచనలు సాగాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
Necessity is the mother of innovation అనే అంశం గుర్తుంచుకోవాలని , ఊబర్ యాప్ రూపకర్త పారిస్ నగరంలో రాత్రి సమయంలో ట్యాక్సీ దోరకుండా ఇబ్బంది పడ్డారని, అలా అతనికి ఆలోచన వచ్చి యాప్ కనిపెట్టడం జరిగిందని, మన చుట్టూ ఉండే నిజమైన సమస్యల పరిష్కారానికి మన చదువు, ఆవిష్కరణలు ఉపయోగపడాలని కేటీఆర్ సూచించారు. .
విద్యార్థులు నూతన ఆవిష్కరణలు ఓరిజనల్ గా ఉండాలని, *వైఫల్యాలను సెలబ్రెట్ చేసుకోవాలని, వైఫల్యం చెందిన తరువాత వదలకుండా కృషి చేసి విజయం సాధించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని విడిచిపెట్టవద్దని, సీఎం కేసీఆర్ కు అనేక అవరోధాలు, అవమానాలు, ఆటంకాలు ఏర్పడ్డాయని, వాటిని ఎదుర్కుంటూ నిలబడటం వల్ల తెలంగాణ సాధ్యమయిందని, ఆ స్పూర్తి విద్యార్థులందరిలో ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు