(Source: ECI/ABP News/ABP Majha)
Warangal News: రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే ఇకపై ఛీటింగ్ కేసులు
Warangal News: రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే ఇకపై ఛీటింగ్ కేసులు నమోదు చేస్తామని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
Warangal News: ఇక వాహనాలపై నంబర్ లేకుండా వాహనం నడిపితే వాహనదారులపై ఛీటింగ్ కేసులను నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహన దారులను హెచ్చరించారు. ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనదారులను కట్టడి చేయడంతో పాటు చోరీ వాహనాలను గుర్తించ వచ్చని చెప్పారు. ఈ క్రమంలోనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వచ్చే జనవరి మొదటి తేదీ నుండి నంబర్ లేకుండా వాహనం నడిపే వాహనదారులపై ఛీటింగ్ కేసు నమోదు చేస్తామన్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనంపై ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేటు ఏర్పాటు, ఉద్యేశ పూర్వంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ను మార్పు చేసిన నంబర్లపై స్టిక్కర్లు గానీ, నంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్కులను తగిలించినా, నంబర్ ప్లేటు వంచినా వాహన దారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేస్తామన్నారు.
ముఖ్యంగా వాహనాదారులు తమ వాహనాలకు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించినప్పటికీ... తమ వాహనాలపై రిజిస్ట్రేషన్ నెంబర్ ఏర్పాటు చేసుకోకుండా వాహనం నడపినా ఛీటింగ్ కేసులను నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
జనవరి నుంచి స్టాప్ లైన్ దాటితే జరిమానాలే..
ఇందులో ముఖ్యంగా అనవరస ఛలాన్లు విధించడం తగ్గిస్తూనే ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలు విధించాలని సీపీ ఎవీ రంగనాథ్ అధికారులకు సూచించారు. కేవలం ద్విచక్ర వాహన దారులపై దృష్టి సారించకుండా కార్లతో పాటు ఇతర వాహనాలపై ట్రాఫిక్ అధికారులు దృష్టి పెట్టాలని, త్వరలో స్టాప్ లైన్లు మరియు జీబ్రా లైన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది అంటే జనవరి మొదటి తేదీ నుండి స్టాప్ లైన్లు దాటి ముందుకు వస్తే జరిమానాలు విధించాలని సూచించారు. అలాగే ప్రతి కూడళ్లలోనూ ఫ్రీ లెప్ట్ ఏర్పాటు చేయాలని, ఫ్రీ టెస్ట్ నిబంధనను అతిక్రమిస్తే జరిమానా తప్పదని వివరించారు. ముఖ్యంగా అధికారులు సమస్యను అధ్యయనం చేసి పరిష్కార మార్గాన్ని వెతకాలని సీపీ రంగనాథ్ వివరించారు. అంతే కాకుండా జంక్షన్లల్లో ఆటోలు నిలిపి వేయకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు ఆటో డ్రైవర్ల అడ్డాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఆపరేషన్ రోప్ నిర్వహిస్తామంటున్న సీపీ
వాహన పార్కింగ్ కోసం ప్రధాన రోడ్డు మార్గాల్లో మార్జిన్ లైన్లను గీయించి.. మార్జిన్ లైన్లలో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేసే విధంగా తగు ప్రచారం చేయాలని వివరించారు. అలాగే బ్యాంకులు, వైన్ షాపులు, బార్ల ముందుగా వాహనాల క్రమబద్ధీకరణ చేసేందుకుగా సంబంధిత యాజమాన్యం ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసుకోనే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఇన్ స్పెక్టర్ అధికారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేస్తారని, త్వరలో హైదరాబాద్ తరహలోనే అపరేషన్ రోప్ నిర్వహింబడుతుందని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగేందుకు.. ప్రమాదకరమైన రీతిలో అనుమతించని ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను తరలించడం, మోటరు వాహనాలు, చిరు వ్యాపారులు, వ్యాపార సంస్థలు రహదారుల ఆక్రమణను నిరోధించడమే ఆపరేషన్ రోప్ ప్రధాన ఉద్యేశమని పోలీస్ కమిషనర్ తెలిపారు.