Acid Attacks: యాసిడ్ దాడులకు పాల్పడితే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష, కొన్నిసార్లు జీవిత ఖైదుగా మారొచ్చు!
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యచరణలో భాగంగా జె.ఉపేందర్ రావు వరంగల్ జిల్లా కృష్ణ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాసిడ్ దాడి- న్యాయ సహాయం అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
వరంగల్ : మహిళలపై యాసిడ్, పెట్రోల్ దాడులు అత్యంత దారుణం, చాలా పెద్ద నేరాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జె.ఉపేందర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యచరణలో భాగంగా జె.ఉపేందర్ రావు వరంగల్ జిల్లా కృష్ణ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాసిడ్ దాడి- న్యాయ సహాయం అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, మహిళలపై యాసిడ్, పెట్రోల్ దాడులు అత్యంత కిరాతకము, క్రూరమైన నేరాలని అన్నారు.
సమాజంలో మహిళలు, ఆడ పిల్లలపై, చిన్నారులపై యాసిడ్ దాడులు జరగకుండా, విద్యార్థినులు సైతం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో, కళాశాలలలో యువత క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా న్యాయ సేవాధికార సంస్థలు అవగాహన సదస్సులు నిర్వహించి, విద్యార్థి, విద్యార్థినులను చైతన్య పరుస్తున్నాయని తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి 1860 సెక్షన్ 326-A కింద కనీస శిక్ష 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందన్నారు. కొన్ని సందర్భాలలో ఇది జీవిత ఖైదుగా మారే అవకాశం ఉందన్నారు. కొన్ని కేసులలో జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారని తెలిపారు.
యాసిడ్ దాడి ప్రభావం బాధితులు ఎదుర్కొంటున్న సమస్యల రీత్యా న్యాయ సేవాధికార సంస్థలు వైద్య సేవల కోసం సుమారు రూ.3,00,000/- నుంచి 8,00,000/- వరకు యాసిడ్ దాడి బాధితులకు నష్ట పరిహారం కింద అందిస్తామని తెలిపారు. యాసిడ్ దాడి బాధితుల ఆరోగ్యం పట్ల మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా సహాయపడతాయని అని తెలిపారు. బాధితులకు నష్టపరిహారం, మెరుగైన వైద్య చికిత్సల విషయంలో న్యాయ సేవా సంస్థలను ఆశ్రయించి న్యాయం పొందవచ్చును అని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థల విధి, విధానాలు, ఉచిత న్యాయ సహాయం మొదలైన చట్టాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు వివిధ చట్టాలపై అవగాహన కలిగి ఉండి, మీ మీ చుట్టుపక్కల వారికి కూడా చట్టాల పట్ల జ్ఞానాన్ని పెంపొందించేలా సహాయపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యం.విజయా దేవి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.