Crime News: గుర్తు తెలియని వ్యక్తితో చిరుతపులి చర్మానికి బేరం, చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
పులి చర్మంతో లక్షలు సంపాదించాలనుకున్నారు. చివరకు జైలు పాలనయ్యారు.
చిరుత పులి చర్మాన్ని విక్రయిస్తు టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన ఇద్దరు నిందితులు. చిరుతపులి చర్మాన్ని అమ్మేందుకు సిద్ధమైనప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దర్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 20లక్షల విలువగల చిరుతపులి చర్మంతోపాటు రెండు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోకల గూడెం గ్రామానికి చెందిన నిందితులు బొడ బాలకృష్ణ, మరో నిందితుడు బదావత్ తిరుపతి కలిసి ఈ దందా సాగిస్తున్నారు. వీళ్లిద్దరు తరచూ తమ గ్రామ శివార్లులోని అటవీప్రాంతంలోకి వేటకు వెళ్లేవారు. జంతువులను వేటాడి ఆ మాంసాన్ని ప్రజలకు అమ్మి సొమ్ముు చేసుకునేవారు.
ఇలా వేటకు వెళ్లే క్రమంలోనే ఒడిశాకు చెందిన వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. ఇలా మాంసం అమ్మితే ఎక్కువ లాభం రాదని.. తమ వద్ద పులి చర్మం ఉంది అమ్మితే గిట్టుబాటు అవుతుందని ఆ ఒడిశా వ్యక్తులు బాలకృష్ణ, తిరుపతికి చెప్పారు. దీన్ని నమ్మిన వీళ్లద్దరు పులి చర్మం అమ్మేందుకు సిద్ధపడ్డారు.
రెండు వర్గాలు వాళ్లు మాట్లాడుకొని పులి చర్మాన్ని 12 లక్షలకు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా బాలకృష్ణ, తిరుపతి 30వేల రూపాయలను ఒడిశా గ్యాంగ్‌కు ఇచ్చారు. పులి చర్మం అమ్ముడైపోయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. 30వేలు చేతికి అందిన తర్వాత ఆ ఒడిశా గ్రూప్ కూడా ఈ డీల్‌కు ఓకే చెప్పింది.
30వేల రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చిన చిరుత పులి చర్మాన్ని తమ వెంట తెచ్చుకున్నారు బాలకృష్ణ, తిరుపతి. దీనిపై మధ్యవర్తుల ద్వారా వేరే వ్యక్తికి బేరం పెట్టారు. 20 లక్షలు ఇస్తే చిరుత పులి చర్మాన్ని అమ్మేందుకు సిద్దపడ్డారు. అవతలి వ్యక్తి కూడా ఆ డబ్బులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
డీల్ ఓకే అనుకున్న తర్వాత చిరుత చర్మం ఇచ్చేందుకు స్పాట్ ఫిక్స్ చేసుకున్నారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ గ్రామం వద్ద చిరుత పులి చర్మం అందజేస్తే స్పాట్‌లోనే ఇరవై లక్షలు ఇచ్చేందుకు ఆ మూడో వ్యక్తి ఓకే చెప్పాడు. స్పాట్‌కు బాలకృష్ణ, తిరుపతి వచ్చి పులి చర్మంతో ఉన్న టైంలో సడెన్‌గా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎంట్రీ ఇచ్చిషాక్ ఇచ్చారు.
మంగళవారం ఉదయం నిందితులు ఖానాపూర్ గ్రామంలో వాటర్ ట్యాంక్ వద్ద చిరుత పులి చర్మం తీసుకొని డబ్బులు ఇచ్చే వ్యక్తి కోసం ఎదురు చూస్తుండగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న చిరుత పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. విషయాన్ని ఆటవీ శాఖ అధికారులకు చేరవేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆటవీ శాఖ అధికారులు అది నిజంగా చిరుతపులి చర్మంగా తేల్చారు.
టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి.. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఆటవీ శాఖ అధికారులకు అప్పగించారు. చిరుత చర్మాన్ని విక్రయిస్తున్న నిందితులను పట్టుకోవడానికి ప్లాన్ చేసిన అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ సహా సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఇలాంటి ప్రయత్నాలు చేసి అనవసరంగా సమస్యల్లో చిక్కుకోవద్దని.. జంతువుల శరీర భాగాలు ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలియదు కానీ.. పోలీసులకు తెలిస్తే మాత్రం శిక్ష పడుతుందని హెచ్చరించారు పోలీస్ కమిషనర్.