Warangal: బతుకమ్మల పైనుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు? మండిపడ్డ వీహెచ్, క్షమాపణలు చెప్పాలని డిమాండ్
బతుకమ్మల మధ్య వరంగల్ రూరల్ ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బతుకమ్మల పట్ల అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా ఆడపడుచులు, మహిళలు బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకుంటున్నారు. రంగురంగుల పూలను పేర్చి ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్నారు. అయితే, ఈ బతుకమ్మల మధ్య వరంగల్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. వరంగల్ రూరల్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బతుకమ్మల పట్ల అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మహిళలంతా బతుకమ్మలతో వచ్చి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతుంటే వాటి పైనుంచి ఎమ్మెల్యే కారు పోనిచ్చారని మండిపడ్డారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.
Also Read: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. కేటీఆర్‌ను కలిసిన రఘునందన్, ఏం మాట్లాడుకున్నారంటే..
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు స్పందించారు. బతుకమ్మ ఆడుతుండగా తన వాహనంతో తొక్కించి మహిళలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అవమానపరిచారని ఏఐసీసీ సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వీ హన్మంతరావు డిమాండ్ చేశారు. ఆత్మకూరు మండల కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలు బతుకమ్మ ఆడుకుంటుండగా బతుకమ్మలపై నుంచి తన వాహనాన్ని తీసుకెళ్లిన ధర్మారెడ్డి మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో ఎస్సీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించారని వీహెచ్ గుర్తుచేశారు. ఆత్మకూరు సర్పంచ్ రాజు బీసీ కావడం వల్లే ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలా వ్యవహరిస్తున్నాడని అన్నారు.
Also Read: కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వరా? అసెంబ్లీలో చర్చ.. కేసీఆర్ స్పష్టత, ఆసక్తికర వ్యాఖ్యలు
అసలేం జరిగిందంటే..
ఆత్మకూరు పట్టణంలోని పోచమ్మ సెంటర్ వద్ద ఉన్న వేణుగోపాల స్వామి గుడి దగ్గర మహిళలు బతుకమ్మలు పెట్టుకొని వేడుక జరుపుకుంటున్నారు. అదే రూట్‌లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు కోరినట్లు తెలుస్తోంది. ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమని మహిళలు చెప్పడంతో బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనిచ్చారని స్థానికులు ఆరోపిస్తూ నిరసన చేశారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఇలా స్పందిస్తున్నారు.
Also Read: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాడు పని.. చైల్డ్ పోర్న్ వీడియోలతో రహస్య దందా.. పోలీసులు ఇలా కనిపెట్టేశారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి