ఆ మాజీ సీఎం కుమారుల అడుగులు ఎటువైపు.. టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత లేక కేడర్ అయోమయం...
మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుల రాజకీయ ప్రయాణం ఎటువైపు మొగ్గుతుంది.. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు..? ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చానీయాంశంగా మారిన అంశం.
జలగం వెంగళరావు తనయుడు జలగం ప్రసాదరావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ఆయన అనంతరం రాజకీయ అరంగ్రేటం చేసిన జలగం వెంకటరావు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు. 2014లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరి పార్టీలో యాక్టివ్‌గా పని చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.
2018 నుంచి రాజకీయాలకు దూరం
ఇప్పుడు కూడా టీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్న జలగం సోదరలు ఎలాంటి యాక్టివ్‌నెస్ కనిపించడం లేదు. 2018 ఎన్నికల తర్వాత వీళ్లు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో జలగం వారసులు ఏం చేయబోతున్నారు..? అనేది ఖమ్మం జిల్లావ్యాప్తాంగా చర్చానీయాంశంగా మారింది.ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో అప్పట్లో కీలకంగా మారిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు జిల్లాలో బలమైన అనుచరగణం ఉండేది. ఆయన వారసుడిగా రాజకీయ అరంగ్రేటం చేసిన జలగం ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ప్రసాదరావు సోదరుడు జలగం వెంకటరావు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారారు. రాష్ట్ర విభజన అనంతరం వెంకటరావు టీఆర్‌ఎస్ పార్టీలో చేరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రారామంటున్న కాంగ్రెస్
2014లోనే జలగం వెంకటరావుకు మంత్రి పదవి వస్తుందని భావించినా కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తుమ్మలకు ఖమ్మం జిల్లా నుంచి మంత్రి పదవి వరించింది. అయితే అప్పట్నుంచి జిల్లాలో బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకునప్పటికీ 2018 ఎన్నికల్లో వెంకటరావు ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన వర్గం స్తబ్థుగా మారింది. ఆ తర్వాత మారిన పార్టీ పిరాయింపుల నేపథ్యంలో ఆయన ఖమ్మం జిల్లాకు దూరంగానే ఉంటున్నారు. గతంలో పార్టీ నుంచి వెళ్లినపోయిన కీలక నేతలను కాంగ్రెస్ ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో జలగం వారసులపై మరోమారు చర్చ సాగుతుంది. ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించే అన్నదమ్ములు టీఆర్‌ఎస్‌లో కొనసాగుతారా..? లేక సొంత గూటికి వస్తారా..? అనే అంశం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది.
పది నియోజకవర్గాలో బలమైన అనుచరగణం..
దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వారసులుగా రాజకీయ అరంగ్రేటం చేసిన ప్రసాదరావు, వెంకటరావుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై మంచి పట్టు ఉంది. తెలంగాణ ఏర్పాటైన అనంతరం ఇద్దరు అన్నదమ్ములు టీఆర్‌ఎస్ పార్టీలో చేరినప్పటికీ వారికి సముచిత స్థానం కల్పించలేదని జలగం అనుచరులు అభిప్రాయపడుతున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో వెంకటరావు ఓటమి పాలవ్వడంతో జలగం కుటుంబాన్ని పట్టించుకోలేదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తా చాటే అవకాశం ఉన్న ఇద్దరు సోదరులు రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వారి అనుచరులు ఆసక్తిగా చూస్తున్నారు.