Kaloji Narayana Rao Award For Jayaraj: ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ కు అరుదైన గౌరవం, కాళోజీ అవార్డు ప్రకటించిన సర్కార్
Kaloji Award 2023 For Jayaraj: ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం జయరాజ్ సేవల్ని గుర్తించింది.
Kaloji Award 2023 For Jayaraj: ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం జయరాజ్ సేవల్ని గుర్తించింది. పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా కాళోజీ అవార్డులు అందజేస్తుంది. 2023 సంవత్సరానికి గాను ‘‘కాళోజీ నారాయణ రావు అవార్డు’’ను ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ కు ప్రకటించింది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. కవి జయరాజ్ ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
ఈ నెల 9 వ తేదీన కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో కవి జయరాజ్ కు కాళోజీ’ అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డు ద్వారా రూ. 1,01,116 (ఒక లక్షా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు) నగదు రివార్డును, జ్జాపికను అందించి శాలువాతో సత్కరించనున్నారు.
ఉమ్మడి వరంగల్, నేటి మహబూబాబాద్ జిల్లా కు చెందిన జయరాజ్ (60) చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. మహబూబాబాద్ మండలం గుమ్మనూర్ లో గోడిశాల చెన్నమ్మ, గొడిశాల కిష్టయ్య దంపతులకు జన్మించారు జయరాజ్. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమ సమాజం కోసం తన సాహిత్యాన్ని సృజించారు. బుధ్దుని బోధనలకు ప్రభావితమై అంబేద్కర్ రచనలతో స్పూర్తి పొందారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లె పల్లెనా తిరుగుతూ.. తన ఆట పాట గానం ద్వారా ప్రజల్లో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించిన ప్రజా కవిగా జయరాజు కృషి చేశారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రచించారు. మనిషికీ ప్రకృతికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు. ఈ మేరకు వారు ముద్రించిన పలు పుస్తకాలు ప్రజాదరణ పొందాయి.
పాటలు
తెలంగాణ బతుకు ఛిధ్రమైన జాడను తన పాటల్లో పట్టి చూపించిండు. ప్రజల గుండెల్లో చిరకాలం యాదికుండే పాటలు రాసిన జానపద గాయకుడు విప్లవోద్యమంలో అనేక పాటలకు ప్రాణం పోసిండు. పోరాడకుంటే బతుకు మారదని, తన పాటలు, రచనల ద్వారా ప్రజలకు దోపిడి మర్మాన్ని విప్పి చెప్పిండు. జయరాజు పాటలు ప్రజలను ఉద్యమ బాటలో నడిపిస్తయి. జోలాలీ పాటవింటే వందకోట్ల భారతీయుల కన్నీటి కథ మన కండ్లముందు ఉంటది. తన స్నేహితుడు చేరాల కనుమూసినపుడు ‘ నిన్నెట్టా మరిచిపోదును చేరాల..’ అన్న పాట ఆయన కలం నుంచి పట్టిన తొలి పల్లవి. కాచినపల్లి ఎన్‌కౌంటర్ పై రాసిన పాట ప్రతి హృదయాన్ని కదిలించింది. ఆకలి, పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పాలకుల పీడనవంటి దీర్ఘకాలిక సమస్యలను పాటగట్టి జనాన్ని పోరుబాట పట్టిచ్చిండు.
సినిమాలకు సైతం..
అడవిలో అన్న సినిమాకు హైలెట్‌గా నిలిచిన ‘వందనాలమ్మ పాట’ జయరాజ్ కలం నుంచి వచ్చిందే. దండోరా సినిమాలోని కొండల్లో కోయిల పాటలు పాడాలి అనే పాటను జయరాజ్ రాశారు.