Revanth Reddy: రేవంత్ రెడ్డి పాదయాత్ర రేపటి నుంచే, పూర్తి షెడ్యూల్ విడుదల
రేపు ఉదయం 11 గంటలకు ములుగు జిల్లా సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మొదటి రెండు రోజుల షెడ్యూల్‌ను ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు ములుగు జిల్లా సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమ్మక్క, సారలమ్మ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లను దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు మేడారం గుడి నుంచి పాదయాత్ర బయలుదేరి తాడ్వాయి మండలంలోని కొత్తూరు, నార్లాపూర్, వెంగ లాపూర్ గ్రామాల మీదుగా గోవిందరావు పేట మండలంలోని ప్రాజెక్టు నగర్ గ్రామానికి మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకుంటుందని సీతక్క తెలిపారు.
అదే రోజు 2 నుంచి 2.30 గంటలకు ప్రాజెక్టు నగర్‌లోనే భోజన విరామం ఉంటుంది. అనంతరం 2.30 గంటలకు ప్రాజెక్టు నగర్ నుంచి బయలుదేరి పాదయాత్ర సాయంత్రం 4.30 గంటలవరకు పస్రా గ్రామానికి చేరుకుంటుంది. 4.30 నుంచి 5 గంటల వరకు టీ విరామం ఉంటుంది. 5 గంటల నుంచి 6 గంటల వరకు పస్రా జంక్షన్‌లో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పస్రా గ్రామం నుంచి గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్ మీదుగా వెంకటాపూర్ మండలంలోని జవహర్‌నగర్, జంగాలపల్లి క్రాస్, ఇంచర్ల, వెంకటాపూర్ క్రాస్‌రోడ్ మీదుగా పాలంపేటకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
7వ తేదీన రామప్పలో బస
7న ఉదయం 8 గంటలకు పాలంపేట రామప్ప దేవాలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు పాలంపేట గ్రామం నుంచి బయలుదేరి రామంజపురం, చెంచుకాలనీ, నారాయణగిరిపల్లె మీదుగా బుద్దారం గ్రామానికి మధ్యాహ్నం 1.30 వరకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి బుద్దారం గ్రామం నుంచి కేశవాపూర్, నర్సాపూర్, బండారు పల్లి మీదుగా సాయంత్రం 6 గంటలవరకు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలకు జిల్లాకేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద కార్నర్ మీటింగు ఉంటుందని సీతక్క తెలిపారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతోపాటు బందోబస్తు కల్పించాలంటూ ఎమ్మెల్యే సీతక్క ములుగు ఎస్పీ గౌస్ ఆలంను కోరారు.
2003 నాటి పరిస్థితులే రాష్ట్రంలో
రాష్ట్రంలో ప్రస్తుతం 2003 నాటి పరిస్థితులే ఉన్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆ సమయంలో చంద్రబాబు హయాంలో వ్యవసాయ, విద్యుత్ సంక్షోభాలు ఉండేవని గుర్తుచేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రేతో కలిసి గాంధీ భవన్‌లో రేవంత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు పార్టీ నేతలతో హాత్ సే హాత్ జోడో యాత్రపై మాణిక్ రావు ఠాక్రే చర్చించారు.
‘‘రాష్ట్రంలో వ్యవసాయ, విద్యుత్ సంక్షోభాలు మళ్లీ వచ్చాయి. కేసీఆర్ హయాంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 2014 నుంచి 2017 వరకు రెండో స్థానంలో, 2017 నుంచి మూడో స్థానంలో ఉంది.’’ అని విమర్శించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లిచ్చామని కేసీఆర్ చెప్తున్నారని, అక్కడకు వెళ్లి చూస్తే 119 నియోజకవర్గాల్లో ఎన్ని ఊర్లకు నీళ్లిచ్చారో తెలుస్తుందని అన్నారు. ‘‘కేసీఆర్ సొంతూరు చింతమడకలో నీళ్లు వస్తున్నాయా? మంత్రులు హరీశ్, ఎర్రబెల్లి దయాకర్ రావు సొంతూర్లలో నీళ్లు వస్తున్నయా?’’ అని నిలదీశారు. 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు.