Warangal MGM: ఎంజీఎంలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం- ఐసీయూలో రోగిని కొరికిన ఎలుకలు
ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు. రెండు రోజుల వ్యవధిలోనే అదే దుర్ఘటన జరిగింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
అనారోగ్యంతో ఉన్న రోగులకు భరోసా కల్పించడంలో ఎంజీఎం(MGM) అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వచ్చిన వ్యక్తిని ఐసీయూ(ICU)లో ఉంచికి చికిత్స అందిస్తున్నారు. ఆయన్ని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయాడు.
వరంగల్‌లోని భీమరానికి చెందిన శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఈ నెల 26 వ తేదీ సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. 27వ తేదీ ఉదయం లేచి చూసేసరికి శ్రీనివాస్ వేలును ఎలుకలు కొరికాయి. విషయాన్ని సిబ్బందికి చెప్పాడు. వెంటనే వాళ్లు చికిత్స చేశారు.
మళ్లీ ఈ ఉదయం(గురువారం) సుమారు మూడు గంటల ప్రాంతంలో ఎలుకలు శ్రీనివాస్ కాళ్లను తీవ్రంగా కొరికాయి. విపరీతమైన రక్తస్రావం జరిగింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్ ఎలకల దాడితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం పై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి పై స్పందించిన ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు శానిటేషన్ కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశామని పక్కనే కిచెన్ ఉండడంతో ఎలుకల బెడద ఉందని చెప్పారు. పాత బిల్డింగ్ కూడా దీనికి ప్రధాన సమస్య అని మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు డాక్టర్ శ్రీనివాసరావు.