Warangal: ‘లాహిరి లాహిరిలో’ మూవీ సీన్ రిపీట్! ఎదురుపడ్డ ప్రత్యర్థులు - చివరికి ఎవరు నెగ్గారంటే?
ఇద్దరు ప్రత్యర్థులు సినిమాలో ఇలా ఎదురు పడిన సీన్ నిజ జీవితంలోనూ జరిగింది. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు కార్లు ఎదురుపడటం కొద్దిసేపు తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
లాహిరి.. లాహిరి.. లాహిరిలో.. సినిమాలో ట్రైన్ సీన్ గుర్తుందా? హీరో హరిక్రిష్ణ వేగంగా కారులో వస్తుండగా, ఆయన ప్రత్యర్థులు కూడా అదే మార్గంలో వేగంగా వస్తుంటారు. హీరో హరిక్రిష్ణ తన దారికి అడ్డు తప్పుకోవాలని డిప్పర్ లైట్స్ ద్వారా సిగ్నల్ ఇస్తారు. అది చూసిన ప్రత్యర్థులు జయప్రకాశ్ రెడ్డి, సత్యప్రకాశ్ తప్పుకొనేది లేదంటూ ఎదురు వెళ్తారు. అలా రెండు కార్లు ఎదురెదురుగా ఓ రైల్వే ట్రాక్‌పై ఆగుతాయి. వెనక్కి వెళ్తే ప్రత్యర్థి ముందు లోకువ అవుతామనే భావనతో ఇరు వర్గాలూ వెనక్కి తగ్గరు. ఇంతలో ట్రైన్ వస్తుంది. హరిక్రిష్ణ తాపీగా ఉండగా, ప్రత్యర్థి అయిన జయప్రకాశ్ వర్గం కంగారు పడుతుంది. చివరికి వారి భార్యలు బతిమాలడంతో వారే వెనక్కి తగ్గుతారు.
ఎదురుపడ్డ ప్రత్యర్థులు
ఇద్దరు ప్రత్యర్థులు సినిమాలో ఇలా ఎదురు పడిన సీన్ నిజ జీవితంలోనూ జరిగింది. వరంగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖిలా వరంగల్‌లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు కార్లు ఎదురుపడటం కొద్దిసేపు తీవ్రమైన ఉత్కంఠకు దారితీసింది. వరంగల్ ఈస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన నన్నపునేని నరేందర్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొండా మురళి ప్రత్యర్థులు అనే సంగతి తెలిసిందే. అయితే, మంగళవారం మొహర్రం సందర్భంగా మధ్యకోటలోని అషూర్‌ఖానాలో కొండా మురళీధర్‌రావు తమ అనుచరులు, కార్యకర్తలతో పీరీలను దర్శించుకొని కారులో తిరిగి వస్తున్నారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కారు కూడా ఎదురుగా వచ్చింది. అసలే రోడ్డు ఇరుకుగా ఉంది. చుట్టు పక్కల జనం కూడా ఉండడంతో ఆ రోడ్డుపై అస్సలు ఖాళీ లేదు. దీంతో పక్కకు వెళ్లే దారి లేక రెండు వాహనాలు ఎదురెదురుగానే నిలిచిపోయాయి. పోలీసులు మురళీధర్ రావు వాహనం వెనెక్కి వెళ్లాలని చెప్పగా ఎదురుగా వచ్చిన వాహనమే తీయాలని తాము వెనక్కి తీయబోమని తేల్చి చెప్పారు. నన్నపునేని నరేందర్ వర్గం కూడా అదే తేల్చి చెప్పింది. తాము వెనక్కి తగ్దేది లేదంటూ రెండు వర్గాల అనుచరులు తమ నాయకుడికి జేజేలు కొడుతూ నినాదాలు చేశారు. ఎంతకీ పరిస్థితి అక్కడ సద్దుమణగకపోగా.. పైగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక చేసేది లేక పోలీసులు కలగజేసుకొని రెండూ వైపులా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అలా ఆ ఇరుకు రోడ్డు పైనే రెండు కార్లను పంపించారు. అలా ఉత్కంఠకు తెరపడింది.
విభేదాలు ఎలా వచ్చాయంటే
2014 లో ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి కొండా మురళి భార్య కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అప్పుడు వరంగల్ మేయర్ గా ఉండేవారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కొండా సురేఖకు టికెట్ ఇవ్వకుండా నన్నపునేని నరేందర్ కు టికెట్ కేటాయించింది. దీంతో కొండా దంపతులు భంగపడి సొంత గూడు అయిన కాంగ్రెస్ లో చేరారు. అలా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నరేందర్ గెలిచారు. అలా వారిద్దరి మధ్య కొన్నేళ్లుగా విభేదాలు నెలకొని ఉన్నాయి.