Bandi Sanjay: బండి సంజయ్ యాత్రలో మళ్లీ ఉద్రిక్తత, కర్రలతో కొట్టుకున్న టీఆర్ఎస్ - బీజేపీ నేతలు!
Praja Sangrama Yatra: ప్రస్తుతం బండి సంజయ్ యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. బండి సంజయ్ గోబ్యాక్ అంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తల నినాదాలు చేశారు.
Bandi Sanjay Praja Sangrama Yatra: బండి సంజయ్ చేస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రం విషయంలో వివాదాలు రేగుతూనే ఉన్నాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆ యాత్ర ఆపాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, నిన్న సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాల మేరకు బండి సంజయ్ నేడు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించగా, నేడు కూడా ఆ యాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. బండి సంజయ్ గోబ్యాక్ అంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తల నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లాలోకి చేరుకోగానే ఒక్కసారిగా కార్యకర్తలు నినాదాలు హోరెత్తాయి. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు.
టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. పోలీసులు లాఠీచార్జ్ చేసి రెండు గ్రూపులను చెదరగొట్టారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా, వారిపై కర్రలతో దాడి చేసేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో కొంత మందికి దెబ్బలు కూడా తగిలాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసి రెండు పార్టీలను కార్యకర్తలను చెదరగొట్టారు. లాఠీఛార్జ్ కారణంగా కొందరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
నిన్న (ఆగస్టు 26) హైకోర్టు అనుమతులతో నేడు పాంనూర్ నుంచి బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉప్పుగల్, కోనూర్, గరిమిళ్లపల్లి, నాగాపురం వరకు పాదయాత్ర నేడు కొనసాగనుంది. శనివారం భద్రకాళీ ఆలయం వద్ద మూడో విడత పాదయాత్ర ముగియనుంది.
ముగింపు సభకు అనుమతి నిరాకరణ
మరోవైపు, బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో ఆగస్టు 27న బీజేపీ భారీ సభ నిర్వహించతలపెట్టింది. అయితే, ఆ సభకు అనుమతిని కాలేజీ ప్రిన్సిపల్ నిరాకరించారు. పోలీసుల నుంచి తమకు సమాచారం లేదని, అందుకే సభకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రావాల్సి ఉంది. అయితే, అనుమతి నిరాకరణపై బీజేపీ హై కోర్టుకు వెళ్లింది. దీనిపై కోర్టు నిర్ణయం నేడు రానుంది.
బండి సంజయ్ యాత్ర ఆపాలని తెలంగాణ సర్కార్ కోర్టులో అప్పీల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేసుకోవచ్చని ఇప్పటికే హైకోర్టు సింగిల్ జడ్జి అనుమతించారు. అందుకోసం పాదయాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసులను సింగిల్ జడ్జి సస్పెండ్ చేశారు. అయితే, ఈ సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను ప్రభుత్వం సవాలు చేస్తూ లంచ్ మోషన్ దాఖలు చేసింది. అప్పీల్ పై అత్యవసర విచారణ చేయాలని సీజే ధర్మాసనాన్ని కోరింది. పాదయాత్ర కొనసాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ అప్పీలుపై మధ్యాహ్నం 1.15 విచారణ చేపట్టేందుకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం అంగీకరించింది.