Nagarsol Narasapur Express: టైగర్ నాగేశ్వర్ రావు సినిమా స్టైల్లో ట్రైన్ దోపిడీ - కాజీపేట్ దగ్గర నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో
Robbery In Nagarsol Narasapur Express: నాగర్‌సోల్ - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో గురువారం తెల్లవారు జామున భారీ దోపిడీ జరిగింది. కాజీపేట జంక్షన్ సమీపంలో నష్కల్, చిన్న పెండ్యాల మధ్య ఈ దోపిడీ జరిగింది.
![Nagarsol Narasapur Express: టైగర్ నాగేశ్వర్ రావు సినిమా స్టైల్లో ట్రైన్ దోపిడీ - కాజీపేట్ దగ్గర నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో Gold Chain Robbery In Nagarsol Narasapur Express Near Kazipet Nagarsol Narasapur Express: టైగర్ నాగేశ్వర్ రావు సినిమా స్టైల్లో ట్రైన్ దోపిడీ - కాజీపేట్ దగ్గర నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/b7fcf7f780ae6d6d8e4360cc5eec2db21717681159234798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gold Robbery In Running Train: నాగర్‌సోల్ - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (Nagarsol Narasapur Express) రైల్లో గురువారం తెల్లవారు జామున భారీ దోపిడీ జరిగింది. వరంగల్ జిల్లా కాజీపేట జంక్షన్ (Kazipet Railway Junction) సమీపంలోని నష్కల్, చిన్న పెండ్యాల మధ్య ఈ దోపిడీ జరిగింది. రైలులోని ఆరు కోచ్‌ల్లో దుండగుల ముఠా దోపిడీకి పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సుమారు 24 తులాల బంగారం చోరీకి గురైనట్లు తెలిసింది. కొద్దిసేపు రైలును ఆపి విచారణ చేసిన అనంతరం పోలీసులు ట్రైన్‌ను పంపించివేశారు. రైల్వే, జీఆర్పీ పోలీసులు దోపిడీపై దర్యాప్తు చేపట్టారు.
రైలు రన్నింగ్‌లో ఉండగానే దోపిడీ
రైలు రన్నింగ్‌లో ఉండగానే దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. ట్రాక్ పక్కనే నిల్చున్న సుమారు 20 మంది దొంగల ముఠా ప్రయాణికుల మెడల్లోంచి బంగారు ఆభరణాలను లాక్కుని పరారయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో బాధితులు పదుల సంఖ్యలో ఉన్నట్లుగా సమాచారం. భారీ మొత్తంలో బంగారాన్ని దోపిడీ చేసినట్లుగా తెలుస్తోంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత గురువారం తెల్లవారుజామున దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. దోపిడీ గురించి సమాచారం అందుకున్న స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీమ్‌శర్మ, కాజీపేట రైల్వే పోలీసులు, చేరుకొని విచారణ చేశారు.
ఎవరో ఇప్పుడే చెప్పలేం
ఇదే విషయంపై ఏసీపీ స్పందిస్తూ.. రన్నింగ్ ట్రైన్‌లో ఉన్న ప్రయాణికుల మెడల్లోంచి బంగారు ఆభరణాలు దోపిడీ చేసింది వాస్తవమేనని నిర్ధారించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని దుండగలను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. దోపిడీ చేసిన ముఠా గురించి తెలుసుకునే పనిలో ఉన్నామని, అంతరాష్ట్ర ముఠాలా కాదా అనేది ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఏప్రిల్‌లో ఇదే తరహాలో
విజయవాడ - గూడూరు మెము రైల్లో గత ఏప్రిల్ నెలలో ఇదే తరహాలో చోరీ జరిగింది. గూడూరు వెళుతున్న మెములో పడుగుపాడు వద్ద కోవూరుకు చెందిన ముగ్గురు రైలెక్కారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో రైలు కొండూరుసత్రం సమీపంలోనికి రాగానే ప్రయాణికులపై దుండగులు దౌర్జన్యానికి దిగారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు, నగదు లాక్కున్నారు. బ్యాగులు తనిఖీ చేస్తూ బీభత్సం సృష్టించారు.
మనుబోలు రైల్వేస్టేషన్ దాటిన తరువాత సిగ్నల్ లేక రైలు ఆగడంతో ఇదే అదనుగా భావించిన దుండగులు రైలు నుంచి దిగిపోయారు. వీరంపల్లి అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై చేరుకుని లారీలను ఆపి వారిపై రాళ్లతో దాడి చేసి దోపిడీకి యత్నించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగులను వెంబడించారు. ఇద్దరు దుండగులు తప్పించుకొని పారిపోగా, కోవూరు ఇనుమడుగు సెంటర్ లక్ష్మీనగర్‌కు చెందిన కొప్పోలు సాగర్‌ను పట్టుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)