Bhupalapally Municipality: భూపాలపల్లి మున్సిపాలిటీలో ముసలం - చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం
Bhupalapally Municipal chairman: భూపాలపల్లి మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. భూపాపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు.
No confidence motion against Bhupalapally Municipal chairman: తెలంగాణలో పలు జిల్లాల్లో ధిక్కార స్వరం వినిపిస్తోంది. పలు చోట్ల మున్సిపాలిటీ చైర్మన్, చైర్ పర్సన్లపై కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. కొన్నిచోట్ల అవిశ్వాస తీర్మానికి రెడీ కాగా, తాజాగా భూపాలపల్లి మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. భూపాపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు.
అధికార పార్టీ బీఆర్ఎస్ కి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట రాణి, వైస్ చైర్మన్ హరిబాబుపై అవిశ్వాస తీర్మానం పెడుతూ జిల్లా అడిషనల్ కలెక్టర్ దివాకర్ కు వినతిపత్రం అందచేశారు పార్టీకి చెందిన కౌన్సిలర్లు. భూపాలపల్లి చైర్ పర్సన్, వైస్ చైర్మన్లు తమ ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారని, పాలక వర్గాన్ని విస్మరించడంతో పాటు ఎక్కడా డెవలప్ మెంట్ జరగడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. దాంతో తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని కౌన్సిలర్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా అధికార పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. పురపాలకసంఘం కౌన్సిలర్లుగా ఎన్నికై (3) సంవత్సరాలు గడిచినది కానీ ఇప్పటి వరకు వార్డులలో ఎలాంటి అబివృద్ధి పనులు జరుగకపోవడం. ప్రోటోకాల్ లేకపోవడంతో తమను అగౌరవపరిచారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. చైర్ పర్సన్, వైస్ చైర్మన్ల ఏకపక్ష నిర్ణయాలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. వారి ఒంటెద్దు పోకడలతో విసుగు చెందుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో భూపాలపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ లు పద్ధతి మారకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడతామని అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు చెప్పారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని కలిసి విషయం తెలియజేస్తామని ఈ సందర్భంగా కౌన్సిలర్లు తెలిపారు.
భూపాలపల్లి మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన 20 మంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట రాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబులపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. మూడేళ్లు గడుస్తున్న నిధులు లేవని, డెవలప్ మెంట్ జరగడం లేదని, దాంతో పాటు ప్రోటోకాల్ సైతం పాటించడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ దివాకరకు అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో బీఆర్ఎస్ లో అసమ్మతి రాజుకుంది. అడిషనల్ కలెక్టర్ కు నోటీసు ఇచ్చిన సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాల్ పల్లిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.