(Source: ECI/ABP News/ABP Majha)
Bhadradri Encounter: చర్ల సరిహద్దులో పోలీసుల ఎదురుకాల్పులు, ఇద్దరు మావోయిస్టులు మృతి
Bhadradri Encounter: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో.. ఇద్దరు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు.
Bhadradri Encounter: గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దు చర్ల అటవీ ప్రాంతంలో అలజడి నెలకొంది. పోలీసుల బూట్లు చప్పుల్లు, తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. పోలీసుల ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఎర్రంపాడు సరిహద్దు ప్రాంతం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సూక్ష్మ జిల్లా కిష్టారం - పుట్ఠపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో.. యస్టీయఫ్ బలగాలు, చర్ల పోలీసుల ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారస పడడంతో ఇరువైపులా కాల్పు చేసుకున్నట్లు సమాచారం. ముందుగా పోలీసులు... మావోయిస్టులను లొంగిపోవాలని ఆదేశించినా వారు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారు కూడా ఆత్మ రక్షణ కోసం ఎదురు కాల్పులకు పాల్పడగా.. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు వివరిస్తున్నారు. అయితే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది గుర్తించాల్సి ఉందని... జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. కాల్పుల ఘటనకు సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎల్ ఓఎస్ కమాండర్ మడకం ఎర్రయ్య అలియాస్ రాజేష్, ఛత్తీస్ గఢ్ కు చెందిన మరో మావోయిస్టు సభ్యుడు మృతి చెందినట్లు తెలుస్తోంది.