Bhadrachalam Floods: భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం - మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Bhadrachalam Floods: తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పొంగిపొర్లుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరగగా మరోసారి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Bhadrachalam Floods: తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు, జలపాతాలన్నీ పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా గోదావరి నది అయితే ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. నిన్ని వరకు 39 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నది ఈరోజు ఉదయానికి 40 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటలకు 44.4 అడుగులకు చేరుకోగా.. అప్రమత్తమైన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి 23 గేట్లు ఎత్తి లక్షా 80 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నీటిమట్టం మరింత పెరిగితే ఈరోజు రాత్రి వరకు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. నీటిమట్టం 43 అడుగలకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
భారీగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఏర్పడితే అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలని, ప్రజలు ఇళ్లన నుంచి బయటకు రావొద్దని సూచించారు. వర్షాల వల్ల పొంగి పొర్లుతున్న వాగులు దాటొద్దని అన్నారు. అలాగే ప్రజలందరూ అధికారులు చెప్పే సూచనలు కచ్చితంగా పాటించాలని అప్పుడే ఎలాంటి ఇబ్బందుల పాలవరని వివరించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమవుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అల సూచించారు.
అలాగే భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గోదావరి కరకట్ట ప్రాంతం వద్ద విస్తా కాంప్లెక్స్ ఏరియాలో మోటార్ల ద్వారా బ్యాక్ వాటర్ ను తొలగించే ప్రాంతాన్ని పరిశీలించారు. రామాలయం ఏరియాలో కొత్త కాలనీలో వరద నీరు చేరకుండా అధికారులు ఎప్పటికప్పుడు బ్యాక్ వాటర్ ను మోటార్ల ద్వారా తొలగించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసం అయితే తప్ప వర్షంలో బయటకు రాకూడదని సూచించారు.
మహబూబాబాద్ లోనూ దంచికొడుతున్న వర్షం
మహబూబాబాద్ లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో ఏజెన్సీ గ్రామాల్లోని వాగులు, వంకలన్నీ ఉరకలెత్తుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, నిండుకుండలా మారాయి. కొత్తపల్లి వైపు వెళ్లే బుర్కపల్లి వాగు పొంగడంతో రహదారిపై వాహనాలు అన్నీ నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. వేలుబల్లి కతర్ల వాగు సైతం పొంగుతోంది. నర్సంపేట నుంచి కొత్తగూడ వైపు వెళ్లే దారిలో గాదెవాగు గుంజేడుతోగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.
భీమునిపాదం జలపాతం వద్ద సందర్శకులకు నో ఎంట్రీ
కొత్తపల్లి మండలంలోని గాంధీ నగర్ లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మోదె నరసమ్మ అనే వృద్ధురాలు ఇళ్లు కూలిపోవడంతో ఆ కుుంబం మొత్తం నిరాశ్రయులు అయ్యారు. గూడూరు మండలం కొమ్ముల వంచ శివారులో భీముని పాదం జలపాతం భారీ వర్షాలకు ఉద్ఘృతంగా పొంగుతోంది. పర్యాటకులు జలపాత సందర్శనానికి రాకూడదని అటవీ శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టారు.