పాదయాత్రలో బండి సంజయ్ అరెస్ట్- జనగామలో హైటెన్షన్
దిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలో అగ్గి రాజేసింది. బీజేపీ టీఆర్‌ఎస్ మధ్య యుద్ధానికి కారణమైంది. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు అయ్యే వరకు వెళ్లింది.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో జనగాంలో ఆయన చేపట్టే పాదయాత్ర శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా పోలీసుల మోహరించి బండిని అరెస్టు చేశారు.
బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులు అటువైపు వచ్చేందుకు వీలు లేకుండా పక్కా వ్యూహాన్ని పన్నారు పార్టీ శ్రేణులు. ఆయన చుట్టూ భద్రతా వలయంగా కార్యకర్తలు ఏర్పడ్డారు. వాళ్లను పక్కకు లాగిపడేశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్‌ను తీసుకెళ్తున్నంత సేపు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియుకుండా పోయింది.
Live : https://t.co/ybfZutS0gv
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 23, 2022
దిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కవిత టార్గెట్‌గా బీజేపీ నిన్నంతా ఎదురు తాడి చేసింది. సాయంత్రానికి బీజేపీకి చెందిన మహిళా నేతలు... కవిత ఇంటి ముట్టడికి యత్నించారు. స్కాంలో ఇరుక్కున్న ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు... వారిపై కేసులు పెట్టారు.
బీజేపీ శ్రేణులపై పెట్టిన కేసులపై భగ్గుమన్నారు బీజేపీ లీడర్లు. వెంటనే కేసులు ఉపసంహరించుకోవాల్సిందేనంటూ పట్టుపట్టారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు నిరసనకలకు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. అంతే కాదు తమ శ్రేణులు, నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ తానే స్వయంగా దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రస్తుతం జనగామలో పాదయాత్రలో ఉన్న బండిసంజయ్ అక్కడే దీక్ష చేసేందుకు రెడీ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ధర్మ దీక్ష పేరుతో నిరసన చేపడుతున్నట్టు ప్రకటించారు. నల్లబ్యాడ్జీలు ధరించి అంతా జనగామలో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం వరకు దీక్ష చేసి మధ్యాహ్నం తర్వాత పాదయాత్ర కంటిన్యూ చేయాలని నిర్ణయించారు.
ధర్మ దీక్షకు కూర్చుంటున్న టైంలో జనగామ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసుల రంగప్రవేశంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అరెస్టు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు వలయాలుగా ఏర్పడి... బండికి రక్షణ గోడలా నిలబడ్డారు. పోలీసులు అటువైపు రాకుండా జాగ్రత్త పడ్డారు. వారందర్నీ పక్కకు నెట్టేస్తూ పోలీసులు బండిని అదుపులోకి తీసుకున్నారు. కానీ జీపులో ఆయన్ని ఎక్కించుకొని అక్కడి నుంచి బయటపడేందుకు మాత్రం శ్రమ పడాల్సి వచ్చింది.