Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం, స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగి 9 షాపులు దగ్ధం
Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. మంటలు పక్కనున్న 9 షాపులకు వ్యాపించాయి.
Warangal Fire Accident : వరంగల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఉన్న స్క్రాప్ దుకాణంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయని ఫైర్ ఆఫీసర్ భగవాన్ రెడ్డి తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో 9 షాపులకు మంటలు అంటుకున్నాయి. నివాస గృహాలకు మంటలు విస్తరించడంతో స్థానికులను పోలీసులు ఖాళీ చేయించారు. మొత్తం ఏడు ఫర్నిచర్ షాప్ లతోపాటు ఫర్టిలైజర్ షాప్, పాత ఇనుప సామాను షాపులు అగ్నికి ఆహుతయ్యాయి.
ఫైర్ ఇంజిన్లతో అదుపులోకి మంటలు
ఆరు ఫైరింజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. నివాస గృహాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఫర్నిచర్ షాపులు వెలసినట్టు తెలుస్తోంది. ఇలాంటి దుకాణాలన్నీ ఒకే చోట ఉండడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు సమాచారం. అగ్ని ప్రమాద ప్రదేశంలోనే పిల్లల హాస్పిటల్, లిక్కర్ షాప్ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎలాంటి అనుమతి లేకుండా షాప్ లు నడిపిస్తున్నారు అనే చర్చ సాగుతోంది. అధికారులు చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
సచివాలయంలో అగ్నిప్రమాదం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో సచివాలయం ప్రధాన గుమ్మం దగ్గర దట్టంగా పొగలు అలముకున్నాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 11 అగ్ని మాపక యంత్రాలతో రంగంలోకి దిగింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ డీజే నేరుగా రంగంలోకి దిగారు.
Series of fire accidents in Hyderabad including new #Telangana Secretariat is concerning. @BJP4Telangana demands BRS govt to immediately take up audit ahead of summer season and ensure fire doesn’t engulf any more lives of people. pic.twitter.com/qvnHB3pkLy
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 3, 2023
క్వాలిటీ లేకుండా పనులు
ఈ ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్ కుమార్ స్పందించారు. నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురదృష్టకరం అని చెప్పారు. ఆదరా, బాదరా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం అని అన్నారు. ఫిబ్రవరి 17వ తేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలన్నారు. పైర్ సేఫ్టీ అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు.