Siddipet: 60 పైసల కోసం చెక్కు ఇచ్చిన బ్యాంకు, అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Siddipet: సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి 60 పైసల బ్యాంకు చెక్కు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Siddipet: సిద్దిపేట జిల్లా నర్మేటకు చెందిన దాచవరం రాజశేఖర్ కు ఓ స్పీడ్ పోస్టు వచ్చింది. రెండ్రోజుల క్రితం వచ్చిన ఆ స్పీడ్ పోస్టు చూసిన రాజశేఖర్.. ఇదేదో చాలా ముఖ్యమైనది అయి ఉంటుందని అనుకున్నాడు. అయినా.. తనకెవరు పంపించారా అని కూడా రాజశేఖర్ కు అనుమానం వచ్చింది. తన పేరు పైన వచ్చిన ఆ స్పీడ్ పోస్టు కవర్ ను ఓపెన్ చేసి చూసి అవాక్కయ్యాడు. అందులో ఓ బ్యాంకు చెక్కు ఉంది. తన పేరు, అకౌంట్ నంబర్ తో కూడిన వచ్చిన ఆ చెక్కుపై ఉన్న అమౌంట్ చూసి రాజశేఖర్ షాక్ కు గురయ్యాడు.
దాచవరం రాజశేఖర్ కు వచ్చిన ఆ బ్యాంకు చెక్కులో ఉన్న మొత్తం ఎంతో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే, ఆ బ్యాంకు చెక్కుపై 60 పైసల మొత్తం రాసి ఉంది. రూ.0.60 అని క్లియర్ గా రాసి ఉండటం చూసి అయోమయానికి గురయ్యాడు. అందులో కేరళలోని సౌత్ ఇండియా బ్యాంక్ త్రిసూర్ బ్రాంచ్ నుంచి అకౌంట్ పే ద్వారా 60 పైసలకు చెక్కును చూసిన రాజశేఖర్.. తనకు చెక్కు ఎవరు పంపారు.. తనకు డబ్బులు ఎందుకు వచ్చాయో తెలియక జుట్టు పీక్కున్నాడు. రెండు రోజుల పాటు కష్టపడి విచారిస్తే అసలు విషయం తెలిసింది.
గతంలో క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న లోన్ క్లియరెన్స్ చేయగా 60 పైసలు ఎక్కువ కట్టినట్లు తేలింది. ఆ 60 పైసల మొత్తానికి బ్యాంకు చెక్కు పంపించినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. రాజశేఖర్ కు చెల్లించే డబ్బుల కంటే చెక్కు ఓచర్, స్పీడ్ పోస్ట్ కు అయ్యే ఖర్చులు చాలా ఎక్కువ. అయినప్పటికీ న్యాయ బద్ధంగా చెక్కు పంపినందుకు లోన్ చ్చిన కంపెనీ వారిని గ్రామస్థులు అభినందిస్తున్నారు. ఇంతకీ 60 పైసల చెక్కు తన అకౌంట్ లో వేసుకోవాలా.. వద్దా అని రాజశేఖర్ డైలమాలో పడిపోయారు.