మామిడి చెట్లకు పెళ్లి చేసిన పాలమూరు రైతు కుటుంబం
మనుషులకు జరిపే పెళ్లిళ్ల మాదిరిగానే బంధుమిత్రులు పెళ్లి కుమారుడి తరఫు,పెళ్లికుమార్తె తరఫు వారిగా వేర్వేరుగా కూర్చొని ఈ క్రతువు సాగించారు.
మనుషులకు పెళ్లిళ్లు కావటం సర్వసాధారణం. అయితే.. మనుషులకే కాకుండా అక్కడక్కడా మూగజీవులకు, చెట్లకు కూడా పెళ్లిళ్లు చేయటం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇందులో ప్రధానంగా గ్రామాల్లోని కొన్ని ఆలయాల్లో రావి చెట్టుకు, వేపచెట్టుకు శాస్ట్రోక్తంగా పెళ్లిళ్లు చేస్తుంటారు. ఇలా చేస్తే.. గ్రామానికి మంచి జరుగుతుందని నమ్మకం. అయితే.. ఓ రైతు మాత్రం తన పొలంలోని రెండు మామిడిచెట్లకు ఘనంగా పెళ్లి చేశాడు. కాపుకాసిన మామిడి తోటను కోసేముందు శాస్త్రోక్తంగా ఈ తంతు జరిపించాడు. కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన వేడుకను ఊళ్లోవాళ్లంతా వింతగా చెప్పుకున్నారు.
ఇదివరకెప్పుడు వినని ఆచారాన్ని పాటించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తి గ్రామపంచాయతీ పరిధిలోని రాంరెడ్డిపల్లి తండాలో. ఓ మామిడి రైతు తన తోటలోని మామిడి చెట్లకు ఘనంగా పెళ్లిచేశాడు. పెళ్లి అంటే అలాంటి ఇలాంటి పెళ్లి కాదు.. కుటుంబసభ్యులతో పాటు బంధువులందరినీ పిలిచి.. పెళ్లికూతురు, పెళ్లికొడుకు అవతారాల్లో చెట్లను రెడీ చేసి.. శాస్త్రబద్ధంగా.. వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత.. వింధు భోజనాలు కూడా వడ్డించారు. అంతేకాదు.. సంప్రదాయం ప్రకారం.. ఆడపడుచులకు ఒడి ఒడిబియ్యం కూడా పోశారు. బట్టలు పెట్టాడు. మనుషుల పెళ్లికి ఏమాత్రం తక్కువకాకుండా పెళ్లి జరిపించటం ఆసక్తికరం.
రాంరెడ్డిపల్లి తండాకు చెందిన ఓ కుటుంబంలలో ఐదుగురు అన్నదమ్ములకు 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో ఐదురుగు కలిసి.. మామిడి తోట పెట్టారు. సుమారు 500 వరకు చెట్లు పెంచుతున్నారు. సాధారణంగా అయితే.. మామిడి తోట కాపుకొచ్చిన సమయంలో.. చెట్లకు పద్ధతి ప్రకారం చిన్నగా పూజ చేసి.. ఫలాలు కోస్తారు. కానీ.. ఈ రైతులు మాత్రం.. శాస్త్రోక్తంగా మామిడి చెట్లకు పెళ్లిళ్లు చేసిన తర్వాతే పండ్లు కోస్తారు. అయితే.. చెట్లపెళ్లే కదా అని భావించి తూతూమంత్రంగా చేయలేదు. తమ ఐదుగురు కుటుంబసభ్యులను, బంధువులను పిలిచి.. చెట్లను వధూవరుల్లాగా ముస్తాబు చేశారు. పూజారుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేశారు.
మనుషులకు జరిపే పెళ్లిళ్ల మాదిరిగానే బంధుమిత్రులు పెళ్లి కుమారుడి తరఫు,పెళ్లికుమార్తె తరఫు వారిగా వేర్వేరుగా కూర్చొని ఈ క్రతువు సాగించారు. వేద మంత్రాల నడుమ మాంగళ్యధారణ గావించారు. అనంతరం తలంబ్రాలు తంతును కూడా సంప్రదాయబద్ధంగా చేశారు. అంతేకాకుండా.. ఇంటి ఆడపడుచులకు చీర, సారెలు కూడా అందించారు. పెళ్లి అనంతరం బంధుమిత్రులు, కుటుంబసభ్యులతో కలిసి విందుభోజనాలు ఆరగించారు. మొత్తం క్రతువు ముగిశాక.. చెట్ల నుంచి మామిడి కాయలను తెంపుకున్నారు. అందులో కొన్నింటిని వచ్చిన బంధువులకు పంచిపెట్టారు.
పూర్వీకుల నుంచి మామిడి చెట్లకు పూజలు చేయటం ఆనవాయితీగా వస్తుందని బాలునాయక్ అనే రైతు చెప్పారు. అందులో భాగంగానే.. వాళ్ల మామిడి తోటలో ఫలాలు కోసే ముందు.. పెద్దలు చెప్పిన ఆనవాయితీ ప్రకారం చెట్లకు పెళ్లిళ్లు జరిపించటం అనావాయితీగా వస్తుందన్నారు. అందులో భాగంగానే.. ఈసారి కూడా చెట్లకు ఘనంగా పెళ్లి చేశామని చెప్పారు.
గృహనిర్మాణాల సమయంలో భూమిపూజ చేయడం ఆనవాయతీగా వస్తున్నా, భూమి నుంచి వచ్చిన వృక్షానికి కూడా పూజ చేయడం పూర్వజన్మ సుకృతం అంటారు పెళ్లి జరిపిన పూజారి. మామిడిపండు సాక్షాత్తూ దైవఫలం, కాబట్టి ఆ చెట్టుకు పెళ్లి జరిపితే లక్ష్మీనారాయణుడికి జరిపినట్టే అంటారాయన. ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది. తిరిగి ఆ వనదేవతకు ఏదోరకంగా రుణం తీర్చుకుంటే అంతకంటే మానవజన్మకు సార్ధకత ఇంకేముంది అంటారు పూజారి.