Breaking News Live: మాచవరం పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో పొడి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.
కానీ, మార్చి 4న మాత్రం దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉందని వెల్లడించారు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని ప్రకటించారు. మార్చి 5వ తేదీన కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని వెల్లడించారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది.
‘‘బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారుతోంది. ఇది మెల్లగా ఉత్తర తమిళనడు వైపుగా కదలనుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం దీని ప్రభావం మన రాష్ట్రంలో మార్చి 4 అర్ధరాత్రి నుంచి మెల్లగా మొదలవ్వనుంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో మార్చి నాలుగు నుంచి అంతగా వర్షాలు ఉండవు. కానీ కొంచెం గాలులు, కొన్ని వర్షాలు, మేఘావృతమైన ఆకాశం తప్పకుండా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చిలో ఏర్పడే ఎటువంటి అల్పపీడనాలు అయినా తక్కువగా అంచనా వేయొచ్చు. వీటి వల్ల వరదలు రావు. మన రాష్ట్రంలోని తమిళనాడు పరిశర ప్రాంతాల్లో కొంచం ఎక్కువ ప్రభావం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు. రాష్ట్రంలో ఆగ్నేయ దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ మరింతగా పెరగనున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా, ఎండగా ఉండే ఆకాశం ఉంటుంది. ఉదయం సమయంలో అక్కడక్కడా పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. గత 24 గంటల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 33.6 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉంది. వచ్చే 24 గంటల్లో గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నేడు విపరీతంగా పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా పరిణామంతో కొద్ది రోజులుగా బంగారం ధరల్లో భారీ ఎత్తున హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నేడు గ్రాముకు ఏకంగా రూ.100 చొప్పున పెరిగింది. వెండి ధర కూడా గ్రాముకు రూ.2.10 పైసలు పెరిగి కిలోకు రూ.2100 మార్పు కనిపించింది. దీంతో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,040 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.72,100 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,700 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,040గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,100 వేలుగా ఉంది.
మాచవరం పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసింది. శానిటైజర్ మౌత్ వాష్ కలిపి తాగినట్టుగా జీజీహెచ్ డాక్టర్లు తెలిపారు. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమెకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి పర్వాలేదని వైద్యులు తెలిపారు. రైటర్ కాళిప్రసాద్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మహిళా కానిస్టేబుల్ సోదరుడు ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్ స్పృహలోకి రావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన రెండో దఫా చర్చలు
రష్యా - ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలు జరుగుతున్నాయి. బెలారస్ లో ఇరు దేశాల ప్రతినిధులు మరోసారి భేటీ అయ్యారు. గతంలో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రష్యా బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుంది. నాటోలో చేరబోమని రాతపూర్వక హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తుంది.
💬#Zakharova: As you know, direct talks between Russian and Ukrainian representatives are underway on Belarusian territory.
— MFA Russia 🇷🇺 (@mfa_russia) March 3, 2022
❗️We hope that they bring about an end to this situation, restore peace in #Donbass and enable all people in Ukraine to return to peaceful life. pic.twitter.com/Qcawx9f7zE
రేపు పోలవరంలో పర్యటించనున్న సీఎం జగన్
శుక్రవారం సీఎం వైఎస్ జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం, పునరావాస కాలనీలలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, గం.10 లకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. ఆ తర్వాత గం.11.20లకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి గం.12.30లకు పోలవరం డ్యామ్ సైట్ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. తర్వాత జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ పరిశీలిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసం చేరుకుంటారు.
ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
విశాఖలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య
విశాఖలోని పోతిన మల్లయ్య పాలెం శివశక్తి నగర్‌లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సురేష్ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పీఎం పాలెం పోలీసులు సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సురేష్ ఆత్మహత్యకు పాల్పడే ముందు తన భార్యతో వీడియోకాల్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.