Telangana news : బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులు.. వెళ్లొద్దంటూ కన్నీరు మున్నీరుగా విలపించిన విద్యార్థులు
Suryapet And Jangaon News :విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బదిలీపై వెళుతుండడంతో విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణలోని పలుచోట్ల ఉపాధ్యాయులను వెళ్ళవద్దు అంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు.
Telangana Teachers News : ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వ సాధారణం. కనీసం రెండు, మూడేళ్లకు ఒకసారైనా బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అయితే, తాము పని చేసిన చోట అతికొద్దిమంది మాత్రమే అక్కడే ప్రజలు, స్థానికుల మనసులను గెల్చుకుంటారు. బదిలీపై వెళ్లినప్పుడు అక్కడున్న వారంతా బదిలీపై వెళుతున్న అధికారులను చూసి బాధపడుతుంటారు. కొందరు వెళ్లొద్దంటూ వేడుకొంటూ ఉంటారు. తాజాగా ఇటువంటి అనుభవమే కొందరు ఉపాధ్యాయులకు తెలంగాణలో ఎదురైంది. ఇన్నాళ్లు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించిన ఆ ఉపాధ్యాయులు బదిలీపై వెళుతుంటే.. పదుల సంఖ్యలో విద్యార్థులు వారి చుట్టూ చేరి వెళ్ళొద్దంటూ వేడుకున్నారు. తెలంగాణలోని రెండు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారాయి. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా సైదులు గడిచిన 14 ఏళ్లుగా పని చేస్తున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడంలో టీచర్ గా కాకుండా స్నేహితుడిగా వ్యవహరిస్తూ వచ్చిన ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆప్తుడిగా మారిపోయారు. ఆ టీచర్ ఎప్పుడు రాకపోయినా ఆ విద్యార్థులు మనసు కలత చెందుతూ ఉంటుంది. అటువంటి ఉపాధ్యాయులకు కొద్ది రోజుల కిందట బదిలీ అయింది. ఆ మాస్టారు ఇకపై రారని తెలుసుకున్న విద్యార్థులు కన్నీరు మున్నీరుగా వినిపించారు. బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేందుకు ఉపాధ్యాయుడు సిద్ధమవుతుండగా తమను వదిలి వెళ్ళవద్దు అంటూ ఉపాధ్యాయుడిని పట్టుకుని విద్యార్థులంతా ఏడ్చారు. అంతేకాకుండా పదుల సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయుడు కాళ్ళ మీద పడి మరి బోరున విలపించారు. మీరు ఇక్కడే ఉండాలి మాస్టారు అంటూ విలపించారు. ఉపాధ్యాయుడు సైదులు వెళ్లడాన్ని విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. అయినా, సరే మాస్టారు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనడంతో.. విద్యార్థులు ఉపాధ్యాయుడు సైదులుకు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఆ మాస్టారును కూడా అడ్డుకున్న విద్యార్థులు..
సరిగ్గా ఇటువంటి ఘటనే జనగామ జిల్లాలోనూ చోటుచేసుకుంది. జనగామ జిల్లా శామీర్పేట ప్రాథమిక పాఠశాలలో సుధీర్ అనే ఉపాధ్యాయుడు గత కొన్నాళ్ల నుంచి పని చేస్తున్నారు. ఆయనకు తాజాగా మరోచోటకు బదిలీ అయింది. సుధీర్ మాస్టారు బదిలీపై వెళుతున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు గేటుకు అడ్డుగా నిలబడి వెళ్ళవద్దు అంటూ మాస్టారును వేడుకున్నారు. మీరు ఇక్కడే ఉండాలి మాస్టారు అంటూ మాస్టారుకు విజ్ఞప్తి చేశారు. కన్నీటి పర్యంతమై అడ్డుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థులను చూసి సుదీర్ మాస్టర్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. మళ్లీ వస్తానంటూ విద్యార్థులకు ధైర్యం చెప్పి ఆయన బయలుదేరి వెళ్లారు. మాస్టారు వెళ్లిన తర్వాత కూడా విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు చూసిన స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.