KTR BJP Chargesheet : అన్ని వర్గాలనూ మోసం చేసిన బీజేపీ - చార్జ్‌షీట్ విడుదల చేసిన కేటీఆర్ !
బీజేపీ పాలనపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ చార్జిషీట్ విడుదల చేశారు. అన్ని వర్గాలనూ బీజేపీ మోసం చేసిందన్నారు.
KTR BJP Chargesheet : మునుగోడు ఉపఎన్నికల ముందు బీజేపీపై కేటీఆర్ చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఎనిమిదేళ్లలో ఏ వర్గానికి మేలు చేయకుండా.. ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ప్రజల తరపున కేంద్రంపై చార్జీషీట్ వేస్తున్నామని ..బీజేపీ సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి నిర్మూళనను పట్టించుకోలేదని, మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదని, మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా.. నిధులు ఇవ్వనందుకు తాము చార్జీషీట్ వేస్తున్నామని చెప్పారు.
మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ధనబలంతో కొనాలనుకుంటున్న జూటా, జుమ్లా బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జ్ షీట్https://t.co/KQutAYKGcl#VoteForCar #MunugodeWithTRS
— TRS Party (@trspartyonline) October 29, 2022
1/4 pic.twitter.com/tMk6zn9smY
చేనేత వస్త్రాలపై 5శాతం జీఎస్టీ, హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేశారని, యార్న్ పై సబ్సిడీ రద్దు చేశారని ..వ్యవసాయ బావుల వద్ద మోటర్లకు మీటర్లు పెడుతామని చెప్పారని, ఉచిత విద్యుత్ కు మంగళం పాడుదామని నిర్ణయించారని, యాదాద్రి పవర్ ప్లాంట్ కు రుణాలు రాకుండా కేంద్రం చేసిందన్నారు. కృష్ణా నది జలాల పంపకాల విషయంలో ఎనిమిదేళ్లుగా కేంద్రం రాజకీయం చేస్తోందని, అందుకే చార్జీషీట్ వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధరను 1200 రూపాయలకు పెంచారంటూ మండిపడ్డారు. ఈ విషయంలో మహిళల తరపున కేంద్రంపై చార్జీ షీట్ వేస్తున్నామని చెప్పారు.
ముడి చమురు ధరలు పెరగపోయినా.. చమురు ధరలు పెంచి దేశ ప్రజలపై అధిక ధరలు మోపారని కేటీఆర్ మండిపడ్డారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసరాల సరుకుల ధరలను పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారన్నారు. ఐదేళ్ల నుంచి గిరిజనుల రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారని .. బీసీల జనగణన చేయమని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా.. ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నందుకు, కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వశాఖ పెట్టనందుకు బీసీల తరపున చార్జ్ షీట్ వేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ.. ‘ఉచిత పథకాలు అనుచితం’ అంటున్నారన్నారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని.. అందుకే తాము చార్జీషీట్ వేస్తున్నామని ప్రకటించారు.
నల్లధనం తీసుకొస్తానని చెప్పి తీసుకురాలేదని, పెద్ద నోట్ల రద్ధుతో ప్రజలను కుదేలు చేశారని, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ విద్యారంగంపై కక్షగట్టారని, ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఒక్క కొత్త మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వలేదన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం లేదని, రాష్ట్రానికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించారని, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేశారని, విభజన చట్టానికి తూట్లు పొడిచారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అందుకే కేంద్రంపై చార్జీషీట్లు వేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. జేపీ నడ్డా అధ్యక్షుడు ఆనాటి ఆరోగ్యశాఖమంత్రిగా మునుగోడుకు వచ్చి ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పి మాట తప్పారన్నారు. చేనేతలపై జీఎస్టీ విధించారన్నారు. నేతన్నల కడుపు కొట్టేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. నాలుగు వందల సిలిండర్ ధరను పన్నెండు వందలు చేసినందుకు ఓట్లు వేసినందుకు ఆడబిడ్డల తరుపున ఈ ఛార్జిషీటు వేస్తున్నామని తెలిపారు.