Ponnam Prabhakar: స్కూల్స్ రీఓపెన్ - బస్సుల ఫిట్‌నెస్‌పై ఆకస్మిక తనిఖీలకు మంత్రి పొన్నం ఆదేశాలు
School Buses Fitness: పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌పై తనిఖీలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రవాణాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
Telangana Schools Reopen: పాఠశాలల పున:ప్రారంభం (Schools Reopening) కానున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల భద్రతా చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. రవాణాశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేసి చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.
ముగిసిన వేసవి సెలవులు, ఇక స్కూల్స్ రీఓపెన్
అలాగే వేసవి సెలవుల అనంతరం పాఠశాలు ప్రారంభం కానున్న కారణంగా పాఠశాలలు, కళాశాలల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. విద్యా సంస్థల వాహనాల తనిఖీకి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు. విద్యా సంస్థల వాహనాల తనిఖీలో నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని, ప్రతి స్కూల్ బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మంత్రి సూచించారు. వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉంటేనే రోడ్డు ఎక్కేలా చూడాలని ఆదేశించారు. అలాగే పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
బ్లాక్ ఫిల్మ్ గ్లాస్ వాహనాలపై పెరిగిన నిఘా
కారు డోర్‌లకు బ్లాక్ ఫిల్మ్ గ్లాస్ ఉన్న వాటిపై విధిగా తనిఖీలు నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత బలోపేతం చేయాలని, తద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా ఆదాయం పెంచుకోవచ్చని అన్నారు. సీజ్ చేసిన వాహనాలకు సంబంధించి పాలసీలో ఉన్న విధంగా వ్యవహరించాలని సూచించారు. వాహనాలను భద్రపర్చే ప్రదేశాలపై జిల్లా పోలీస్ అధికారులతో కో-ఆర్డినేట్ చేసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో ఆటోరిక్షాలపై ప్రస్తుతం ఉన్న పాలసీతో పాటు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా రూపొందించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నేడు ఉన్నతాధికారులతో సచివాలయంలో కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా రవాణా శాఖ అధికారులు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు , ఆర్టీవో లు తదితర అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది !
— Ponnam Prabhakar (@PonnamLoksabha) June 11, 2024
రవాణా శాఖ లో చట్టానికి లోబడి రెవెన్యూ పెంచేందుకు చర్యలు తీసుకోండి
స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ పై తనిఖీలు… pic.twitter.com/OL0s74hp6F
మంత్రి పొన్నంను కలిసిన పలువురు ప్రముఖులు
మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మంగళవారం (జూన్ 11న) పలువురు ప్రముఖులు కలిశారు. రాష్ట్ర సచివాలయంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే రఘువీర్ రెడ్డి మంత్రి పొన్నంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డికి పొన్నం అభినందనలు తెలిపారు. అలాగే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మంత్రి పొన్నంను కలిశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కంటోన్మెంట్ గణేష్ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి.. రామోజీరావు చిత్ర పటానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను రామోజీ పరామర్శించి ధైర్యం చెప్పారు.
Also Read: తెలంగాణ ఎడ్‌సెట్-2024 ఫలితాలు విడుదల, 96.90 శాతం ఉత్తీర్ణత నమోదు