Revanthreddy: 'ఐటీ, ఈడీ దాడులు దేనికి సంకేతం?' - కాంగ్రెస్ ప్రభంజనం చూసి ప్రధాని, కేసీఆర్ భయపడుతున్నారన్న రేవంత్ రెడ్డి
Telangana News: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలపై ఐటీ, ఈడీ అధికారుల దాడులను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఇలాంటి దాడులకు కాంగ్రెస్ భయపడదని అన్నారు.
Revanthreddy: రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇళ్లపై ఎందుకు ఐటీ, ఈడీ దాడులు జరగడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanthreddy) ప్రశ్నించారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasreddy) ఇంటిపై ఐటీ, ఈడీ దాడులపై (It raids) ఆయన స్పందించారు. ఈ దాడులు దేనికి సంకేతమని, ఇలాంటి వాటికి కాంగ్రెస్ భయపడదని అన్నారు. 'రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం ఉంది. అందుకే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ బెంబేలెత్తుతున్నారు. కాంగ్రెస్ ప్రభంజనం ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం.' అని రేవంత్ స్పష్టం చేశారు.
నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!?
— Revanth Reddy (@revanth_anumula) November 9, 2023
బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!?
రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని…
'కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు'
ఒక్క కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ గా చేసి ఈ దాడులకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తుమ్మల, పొంగులేటి ఇళ్లపై ఐటీ దాడులు కక్ష పూరితంగానే జరుగుతున్నాయని ఆరోపించారు. గత వారం రోజులుగా కాంగ్రెస్ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇలాంటి కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి చేస్తోన్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
అటు, కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం పొంగులేటిపై ఐటీ, ఈడీ దాడులను ఖండించారు. ఈ దాడులు కక్ష పూరితంగానే జరుగుతున్నాయని ఆరోపించారు. నామినేషన్ వేసే సమయంలో ఇలా చేయడం సరి కాదని హితవు పలికారు. ఇలాంటి బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదని, పొంగులేటి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఉదయం నుంచే దాడులు
కాగా, మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంతో పాటు స్వగ్రామం నారాయణపురం, హైదరాబాద్ నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. పొంగులేటి కుమారుడి ఇంట్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ నందగిరిహిల్స్‌లోని జ్యోతి హిల్‌రిడ్జ్, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ఏకకాలంలో 30 చోట్ల ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, తనపై దాడులను పొంగులేటి ఖండించారు. నామినేషన్ వేసే సమయంలో తనను భయపెట్టేందుకు ఈ దాడులని అన్నారు. ఏది ఏమైనా ఈ రోజు నామినేషన్ వేస్తానని, లేకుంటే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు.