TS News Developments Today: తెలంగాణ కొత్త సీఎస్‌పై నేడు ఉత్తర్వులు !
కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తొలిసారి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యతకు ఆయన ఏ రకంగా వ్యూహాలు అనుసరిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నేడు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఈరోజు గాంధీ భవన్‌కు రానున్నారు. ఆయన ఇవాళ ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులతో, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతోపాటు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతోనూ విడివిడిగా సమావేశం కానున్సనారు. వీరితో పార్టీ వ్యవహారాలపై చర్చించనున్నారు. మాణిక్ రావు ఠాక్రే కార్యవర్గ నిరాహారక అధ్యక్షులతోనూ భేటీ కానున్నారు. ఇవాళ ఎగ్జిక్యూటివ్ కమిటీతోనూ, పిసిసి ఆఫీస్ బేరర్‌లతోనూ సమావేశం అవుతారు. రేపు డిసిసి అధ్యక్షులతో పాటు యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ, మహిళా కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ అనుబంధాల సంఘాల అధ్యక్షులతో భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్ రెడ్డికి సీనియర్ కాంగ్రెస్ నేతలకు మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో కొత్తగా ఇన్ ఛార్జ్ గా బాధ్యతలను చేపట్టిన మాణిక్ రావు ఠాక్రే ఏ రకంగా సమస్యను పరిష్కారిస్తారనే ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.
కొత్త సిఎస్ పై నేడు ఉత్తర్వులు.
తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ ను తెలంగాణ నుంచి రిలీవ్ కావాంటూ డీవోపీటి ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రానికి కొత్త సిఎస్ ను నియమించే పనిలో ప్రభుత్వం పడింది. కొత్త సిఎం పై ఇవాళ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రామకృష్ణారావు, శాంతి కుమారి, ఆర్వింద్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
నేడు బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ పర్యటన.
నేడు రేపు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం కూకట్ పల్లిలో జరిగే మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగే లోక్ సభ నియోజకవర్గాల కన్వీనర్, ప్రబారి, విస్తారక్ ల సమావేశంలో పాల్గొంటారు. రేపు ఉదయం మెదక్ మధ్యాహ్నం భువనగిరి లోక్ సభ నియోజకవర్గాల పార్టీ సమావేశంలో పాల్గొంటారు.
పోలీస్‌స్టేషన్ ల పునర్‌వ్యవస్థీకరణ డీజీపీ ఆధ్వర్యంలో నేడు సమావేశం.
రాష్ట్రంలో పోలీస్ స్టేషన్‌ల పునర్‌వ్యవస్థీకరణ జరగనుంది. కొత్తగా ఠాణాల మంజూరుతోపాటు కొన్నింటి పరిధిని మార్చనున్నారు. ప్రజలకు అన్ని విధాలా మరింత చేరువయ్యేందుకు అనువుగా స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించి డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో నేడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 746 పోలీస్‌స్టేషన్లు పని చేస్తున్నాయి. పోలీసుశాఖను మరింత పటిష్ఠపరిచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటికే 30వేల మందికిపైగా సిబ్బందిని భర్తీచేయగా తాజాగా మరో 17వేల మంది నియామకానికి ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. దీనితోపాటు పెద్దఎత్తున వాహనాలు, దేశానికే తలమానికంగా కమాండ్ కంట్రోల్ నిర్మాణం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వెరసి తెలంగాణ పోలీసుశాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తోంది. అలానే పోలీసుల సేవలు ప్రజలకు మరింత సమర్థంగా అందేందుకు, ఆపద సమయంలో సత్వరమే వారిని చేరేందుకు వీలుగా కొత్తగా మరిన్ని పోలీస్‌స్టేషన్లు మంజూరు చేయబోతున్నారు.
రాజధాని పరిధిలో కొత్తగా 22 ఠాణాలు..
ఒక్క రాజధాని నగరంలోనే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 22 కొత్త పోలీస్‌స్టేషన్లు ప్రారంభించనున్నారు. ఇవికాక రాష్ట్రంలో ఇంకో 20 వరకూ కొత్త ఠాణాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. పెరుగుతున్న జనాభా, నేరాల తీవ్రత ఆధారంగా వీటిని పెట్టబోతున్నారు. కొంతకాలంగా రాష్ట్రంలో పట్టణీకరణ వేగం పుంజుకోవటంతో జనసాంద్రత బాగా పెరుగుతోంది. ఉదాహరణకు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాగోల్, బండ్లగూడ ప్రాంతాల్లో జనావాసాలు, జనాభా అనూహ్యంగా పెరుగుతున్నాయి. అందుకే ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌ను విడగొట్టి నాగోల్‌లో కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సూత్రం అనుసరిస్తున్నారు. జనాభా, నేరాల తీవ్రత ఆధారంగా కొత్త పోలీస్‌స్టేషన్లు రాబోతున్నాయి. ఇవి ఏర్పాటు కాగానే పాతవాటి పరిధి మారుతుంది..
నేటి నుంచి ‘సైబ్-హర్’ రెండో విడత కార్యక్రమం
సైబర్ నేరాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రక్రియను తెలంగాణ మహిళా భద్రత విభాగం ముందుకు తీసుకెళ్తోంది. ‘సైబ్-హర్’ కార్యక్రమంలో భాగంగా 2,381 ప్రభుత్వ పాఠశాలల్లోని 9,424 మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే దిశగా ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణ, ఆన్‌లైన్ భద్రత తదితర అంశాలపై ఆరు నెలలపాటు వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. తొలి విడతగా ఇప్పటికే 1,650 ప్రభుత్వ పాఠశాలల నుంచి 3,300 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులను ఎంపిక చేసి గతేడాది శిక్షణ ఇచ్చారు. తాజాగా మరో విడతకు శ్రీకారం చుట్టారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ శిఖాగోయెల్, డీఐజీ సుమతి తెలిపారు. రవీంద్రభారతిలో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌అలీ, సబితాఇంద్రారెడ్డి, డీజీపీ అంజనీకుమార్ పాల్గొంటారన్నారు.