BRS పార్టీ ఫండ్ అక్షరాలా రూ. 1,250 కోట్లు! త్వరలో పార్టీ కోసం టీవీ ఛానల్!
రాబోయే కాలంలో 6 లక్షల కోట్లకు తెలంగాణ బడ్జెట్ఎన్ని కష్టాలొచ్చినా దళితబంధు పథకం ఆగదు
బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలో కేసీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు! పార్టీ ఫండ్ నేటికి రూ. 1250 కోట్లకు చేరిందని తెలిపారు. ఇందులో 767 కోట్ల రూపాయలను డిపాజిట్ చేశామన్నారు. తద్వారా నెలకు 7 కోట్ల రూపాయల వడ్డీ వస్తున్నదని పేర్కొన్నారు. ఆ డబ్బుతో పార్టీని నడపడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేయడం, ప్రచారం, మౌలిక వసతులకు ఖర్చుపెడుతున్నామన్నారు. పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి TV యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా చేపడతామన్నారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ కూడా నడుపుతామన్నారు కేసీఆర్.
ఈ సందర్భంగా పార్టీ ఆర్థిక వ్యవహారాలపై తీర్మానాన్ని సభ ఆమోదించింది. పార్టీ ఆర్థిక వ్యవహారాలను అధ్యక్షులే చూసుకుంటారని సభలో తీర్మానించింది. ఇతర రాష్ట్రాల్లో ఖాతాలు తెరవడం, కోశాధికారి అధ్యక్షుడికి సహాయకుడిగా వ్యవహరించడం, పార్టీ ప్రచారం కోసం దేశవ్యాప్తంగా మీడియా వ్యవస్థలను ఏర్పాటు చేయడం.. తదితర ఆర్థిక వ్యవహారాలను పార్టీ జాతీయ అధ్యక్షునికి కట్టబెడుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ చప్పట్లతో ఆమోదించింది.
చేసిన పనిని చెప్పుకోవాలి.. మీరు కూడానాటైపే ఉంటే ఎలా?
ప్రచార సాధనాలను మెరుగు పరుచుకోవడం.. పార్టీశ్రేణులతో మమేకమవ్వడం..వారి కష్ట సుఖాలను తెలిసుకోని కలుపుకపోవాలని అధినేత కేసీఆర్ సూచించారు. ఆత్మీయ సభల నిర్వహణ నియోజక వర్గాలవారీగా విజయవంతంగా జరిగాయని ప్రశంసించారు. అందుకు పార్టీశ్రేణులను వర్కింగ్ ప్రసిడెంటుకు అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షలమంది ఈ సమావేశాల్లో పాల్గొన్నట్టు తనకు సమాచారమున్నదని అన్నారు. పనులు బాగా చేస్తున్నం కానీ ప్రచారం లేదని చెప్పుకొచ్చారు. చేసిన పని చెప్పుకోవాలి.. మీరు కూడా నాలాగే ఉంటే ఎలా అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలని అధినేత కేసీఆర్ సూచించారు. ప్రచార వ్యవస్థలను ఎవరికివారుగా మెరుగుపరుచుకోవాలని కోరారు. ప్రతినిత్యం ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు చేర్చేలా చర్యలు చేపట్టండని నిర్దేశం చేశారు. తెలంగాణ ప్రగతి గురించి సానుకూలంగా పాజిటివ్‌గా ఆలోచించే మీడియాను, పత్రికలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరమున్నదని తెలిపారు.
రాబోయే కాలంలో 6 లక్షల కోట్లకు తెలంగాణ బడ్జెట్
దళితబంధుకు పెడుతున్న పెట్టుబడి వ్యక్తిగతంగా కాకుండా, సమాజ సంపదను పెంచే సామాజిక పెట్టుబడిగా మారుతుందన్నారు కేసీఆర్. ప్రభుత్వం పంచుతున్న డబ్బు గ్రామాల్లో తిరిగి సమాజానికి చేరుతుందని.. దీన్నే స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారని చెప్పారు. రాబోయే కాలంలో 6 లక్షల కోట్లకు తెలంగాణ బడ్జెట్ పెరుగుతందనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా దళితబంధు పథకం కొనసాగుతదని స్పష్టం చేశారుర. దీనిమీద విద్యార్ధులు రీసెర్చ్ స్టడీ చేయాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. దళితుల్లో వజ్రాలను వెలికితీసే పథకం దళితబంధు పథకం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల మీద వొత్తిడి పెంచుతున్నదని చెప్పారు. మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణ కంటే లక్ష రూపాయలు తక్కువుందని పేర్కొన్నారు. ఇంతకన్నా తక్కువ రాష్ట్రాలు 16, 17 వున్నాయని అన్నారు. తెలంగాణ ఆర్థిక వనరులు పెరుగుతున్నాయనడానికి జీఎస్టీ వసూల్లు మంచి ఉదాహరణ అని... త్వరలోనే పాలమూరు రంగారెడ్డి సహా సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేసుకుందామని చెప్పారు.
మే 4వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని అధినేత కేసీఆర్ తెలిపారు. జూన్ 1న అమరుల స్మారకాన్ని ఆవిష్కరించుకుంటామన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలుంటాయని తెలిపారు. గుణాత్మక రాజకీయాలతో ట్రెండ్ సెట్ చేయడం కోసమే బీఆర్ఎస్ ఉందని.. భారతదేశానికి పార్టీని ఒక వెలుగుదివ్వెగా తీసుకుని ముందుకు పోదామని అన్నారు.