(Source: ECI/ABP News/ABP Majha)
CPI Narayana: కేసీఆర్ అమిత్ షా కాళ్లు పట్టుకున్నారు - సీపీఐ నారాయణ వ్యాఖ్యలు
CPI Narayana Comments: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నారాయణ శుక్రవారం (నవంబర్ 24) తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Narayana Comments on KCR in Kothagudem: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన కుమార్తె కవితను రక్షించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. అందుకే బీఆర్ఎస్ - బీజేపీ కలిసిపోయాయని అన్నారు. అయినా ఆడవాళ్లు చీరలు వ్యాపారం చేసుకోవాలి కానీ లిక్కర్ వ్యాపారం ఏంటని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నారాయణ శుక్రవారం (నవంబర్ 24) తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీపీఐ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతు పలుకుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు డైపర్ లేనిదే బయటకు రాలేడని ఎద్దేవా చేశారు. డైపర్లు మార్చే వనమా కావాలా.. పార్టీలు మారని కూనంనేని కావాలా అని కొత్తగూడెం ప్రజలను ప్రశ్నించారు. వనమా కొడుకు రాఘవ విలాస జీవితం కోసం జైలుకు వెళ్లాడని విమర్శించారు. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జలగం వెంకటరావు బీఫాం డబ్బులు పెట్టి కొన్నారని అన్నారు. ఎన్నికల గుర్తు సింహంను కూడా ఎన్నికల సంఘం నుంచి కొన్నారని ఆరోపించారు. తల్లి లాంటి ఎన్నికల గుర్తును కొనుక్కున్న వ్యక్తి త్రాష్టుడు అని ఆయనే జలగం వెంకట్రావు అని విమర్శించారు.
అన్ని నియోజకవర్గాలల్లోనూ సీపీఐ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు ఓడిపోతేనే రాష్ట్రం, దేశం బాగుపడతాయని సీపీఐ నారాయణ మాట్లాడారు.