TS New Secretariat: తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌లో ఆరో అంతస్తు ఎందుకంత ప్రత్యేకం?
25 మంది మంత్రులు కూర్చునే వీలుగా కేబినెట్ మీటింగ్ హాల్ సచివాలయం శత్రువుకు అందని మహా రక్షణదుర్గం
సీఎం కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు. అది అందరికీ తెలిసిన విషయమే! అందుకే ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్ పెట్టారు. లోపల జనహిత పేరిట కట్టిన హాల్ ప్రజాదర్బారు కోసం పెట్టారు. ఆరో అంతస్తులోనే కేబినెట్ భేటీ జరుగుతుంది. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్ హాలును రూపొందిచారు. ముఖ్యమైన, విశిష్ట అతిథులతో కలిసి సీఎం భోజనం చేసేందుకు ఒక అత్యాధునిక డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. అందులో ఒకేసారి 25 మంది కూర్చుని తినొచ్చు.
సీఎం పేషీ కారిడార్ మార్బుల్ చూస్తే మతిపోతుంది
ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగు విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్ పరిచిన ఆ ప్రాంతం చూపరులను ముగ్ధులను చేస్తుంది. ముఖ్యమంత్రి కార్యాలయం కారిడార్‌ను ప్రత్యేకమైన మార్బుల్స్‌తో సుందరీకరించారు. తెలంగాణ సాంస్కృతిక సంపద ప్రతిబింబించేలా సీఎం చాంబర్ తలుపులు ఉంటాయి. సీఎం గది తలుపులపై సింహం ప్రతిమతో బహుబలి డిజైన్ తీర్చిదిద్దారు. వివిధ అంశాలపై అన్ని శాఖల ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించేందుకు సీఎం కాన్ఫరెన్స్ హాలు అత్యాధునిక వసతులతో నిర్మించారు. సీఎం కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు జనహిత పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు సీఎం విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు.
సచివాలయం -శత్రువుకు అందని మహా రక్షణదుర్గం
కొత్త సచివాలయంలో వెహికిల్ పార్కింగ్ సదుపాయం కూడా భారీ స్థాయిలో సిద్ధమవుతోంది. ప్రాంగణంలో కేవలం సీఎం, మంత్రులు, అధికారులు, సిబ్బందికి మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంటుంది. సుమారు 2.5 ఎకరాల్లో అధికారులు, సిబ్బందికి చెందిన 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, నాలుగు బస్సులు ఏకకాలంలో పార్కింగ్ చేసేందుకు అవకాశం ఉంది. కనీసం 300 కార్లు పట్టే 1.5 ఎకరాల ప్రాంతాన్ని సందర్శకులకు కేటాయించారు. సాధారణ రోజుల్లో రోజుకు 700 నుంచి 800 మంది, అసెంబ్లీ సమావేశాల సమయంలో 1,000 మంది వరకు సచివాలయానికి వస్తారని అంచనా. ఆ మేరకు పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.సచివాలయ భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
చీమ చిటుక్కుమన్నా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాల భద్రాతాధికారులకు చేరిపోతుంది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోనికి ప్రవేశించగలరు. అంటే లోపలికి వెళ్లడం అంత ఆషామాషీ కాదు. నిత్యం సుమారు 650 మందికిపైగా భద్రతా సిబ్బంది పహారా కాస్తారు. రాత్రీపగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్ఠమైన సీసీటీవీల కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సందర్శకుల ఫేస్ రికగ్నిషన్ ద్వారా వారి సమాచారం అప్పటికప్పుడు ఆధార్ డేటాతో అనుసంధానమవుతుంది. పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా సందర్శకుని పూర్తి వివరాలు వెంటనే కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి. దాంతో వచ్చిన మనిషి నేర చరిత్రను వెంటనే పసిగట్టి, అభ్యంతరం ఉంటే విజిట్ నిలిపివేస్తారు.