Medchal Brutal Mureder: దారుణం - యువకుని ప్రైవేట్ పార్టుపై కారం పెట్టి చిత్రహింసలు చేసి చంపేశారు
Telangana News: తాను ప్రేమించిన బాలిక ఇంటికి వెళ్లిన యువకుడ్ని ఆమె తల్లిదండ్రులు చిత్రహింసలు పెట్టి హతమార్చారు. మేడ్చల్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
Telangana News: తెలంగాణలో దారుణం జరిగింది. తాను ప్రేమించిన బాలిక ఇంటికి వెళ్లిన యువకున్ని ఆమె తల్లిదండ్రులు చితక్కొట్టారు. ప్రైవేట్ పార్టుపై కారం కొట్టి హింసించారు. మేడ్చల్ (Medchal) జిల్లా పోచారం ఐటీ కారిడార్ (It corridor) పీఎస్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ కాలనీకి చెందిన యువకుడు (18), బాలిక (15) కొంతకాలంగా ప్రేమించికుంటున్నారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు యువకున్ని మందలించారు. అయినా, యువకుడు వినలేదు. బుధవారం బాలిక తల్లిదండ్రులు ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి బయటకు వెళ్లారు. ఇది తెలుసుకున్న యువకుడు బుధవారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లి కలిశాడు. గమనించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు యువకుడిని పట్టుకుని చితకబాదారు. ప్రైవేట్ పార్టుపై కారం వేసి కొట్టారు. దాదాపు గంట సేపు చిత్రహింసలకు గురి చేయడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హన్మకొండలోనూ దారుణహత్య
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలోనూ దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన దద్దు రాజయ్య, అతని కొడుకు మహేందర్, మరికొందరితో కలిసి తమకున్న గొర్రెలతో పొలం వద్ద మంద పెట్టారు. రోజూలాగే మంగళవారం కూడా మంద పెట్టి, రాత్రి 8 గంటల సమయంలో భోజనం కోసం ఇళ్లకు వెళ్లారు. తిరిగి మంద వద్దకు వస్తున్న క్రమంలో.. సమీపంలో ఎల్కతుర్తి గోపాలపూర్‌కు చెందిన గండికోట లక్ష్మణ్, గండికోట శేఖర్, సూర శ్రీకాంత్, గండికోట రమేశ్ అనే నలుగురు కనిపించారు. దీంతో దొంగలుగా అనుమానించి వారిని దద్దు రాజయ్య, అతని కొడుకు మహేందర్ పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ శేఖర్, శ్రీకాంత్, రమేశ్ అక్కడి నుంచి తప్పించుకోగా.. లక్ష్మణ్ ఒక్కడే వారికి చిక్కాడు. దీంతో లక్ష్మణ్, మహేందర్‌కు తీవ్ర గొడవ జరిగింది. వివాదం తీవ్రం కాగా మహేందర్ కు గాయాలయ్యాయి. దీంతో మహేందర్ తండ్రి రాజయ్య, తమ వద్ద ఉన్న గొడ్డలితో లక్ష్మణ్ పై దాడి చేశారు. ఈ క్రమంలో అతను తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం రాజయ్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా మృతుడు లక్ష్మణ్ భార్య కల్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ధర్మసాగర్ పోలీసులు తెలిపారు.
2 రోజుల క్రితమే పరువు హత్య
అంతకు ముందు 2 రోజుల క్రితమే హైదరాబాద్‌లో పరువు హత్య జరిగింది. అంబర్‌పేట్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని, అమ్మాయి మేనమామ క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. బాపునగర్‌కు చెందిన మౌనిక అనే అమ్మాయి శ్రీనివాస్ రాజును గత కొద్ది రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇది అమ్మాయి మేనమామ పుష్ప రాజ్‌కు నచ్చలేదు. శ్రీనివాస్ రాజుపై కోపం పెంచుకుని, సోమవారం రాత్రి బ్యాట్‌తో చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలోనూ పరువు హత్య
ఏపీ అనంతపురం జిల్లాలోనూ పరువు హత్య కలకలం రేపింది. గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన బాలిక(17) ఓ యువకుడిని ప్రేమించింది. అయితే ఆమెకు ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తుండగా, తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పింది. దీనికి వారు అంగీకరించకపోవడంతో పెద్ద వివాదం రేగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన బాలిక తల్లి, సోదరుడు ఆమెను చితకబాదారు. గొంతుకు చున్నీ బిగించి హతమార్చారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.