Telangana Letter to KRMB: 'సాగర్ ప్రాజెక్టు వద్ద పూర్వ పరిస్థితిని పునరుద్ధరించండి' - కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
Telangana News: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నవంబర్ 28వ తేదీకి ముందున్న స్థితిని పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీకి లేఖ రాశారు.
Telangana Letter to Krishna River Board on Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యాం (Nagarjuna Sagar Dam) వద్ద నీటి విడుదలకు సంబంధించి ఇటీవల ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని తెలంగాణ కేఆర్ఎంబీని (KRMB) మరోసారి కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ కు తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాగర్ డ్యాంను తెలంగాణనే నియంత్రించాలని లేఖలో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అప్పటి పరిస్థితిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేశారు. డ్యాం వద్ద కేంద్ర బలగాల మోహరింపునకు తెలంగాణ ప్రభుత్వం సహకరించిందని, ఏపీ ప్రభుత్వం (AP Government) సైతం తగిన చర్యలు తీసుకునేలా వెంటనే స్పందించాలని లేఖలో కేఆర్ఎంబీని కోరారు.
అసలు వివాదం ఏంటంటే.?
ఇటీవల సాగర్ డ్యాం వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులకు ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. ఏపీ పోలీసులు నవంబర్ 29 (బుధవారం) అర్ధరాత్రి ఆ రాష్ట్ర భూభాగంలోని 13 గేట్లను స్వాధీనం చేసుకుని కంచె వేశారు. ఈ క్రమంలో అక్కడి అధికారులు రైట్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమపై ఏపీ పోలీసులు దాడి చేశారని డ్యాం వద్ద భద్రతా సిబ్బంది, తెలంగాణ అధికారులు ఆరోపించారు. దీంతో పెద్ద ఎత్తున ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడ మోహరించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొనడంతో కేంద్రం జోక్యం చేసుకుని ప్రాజెక్టుల నీటి విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో డ్యాం వద్ద కేంద్ర బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి.
ఈ నెల 6న మళ్లీ సమావేశం
ఇందులో భాగంగా ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో కేంద్ర జల సంఘం, కేఆర్ఎంబీ ఛైర్మన్లు ఆ తర్వాత రోజు సమావేశమయ్యారు. నాగార్జున సాగర్, శ్రీశైలం అనుబంధ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై సుమారు గంట పాటు సమావేశంలో చర్చించారు. ఈ మీటింగ్ కు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు వర్చువల్ గా హాజరయ్యారు. తమ నీటి అవసరాలు, ప్రాజెక్టుల పరిస్థితిని ఏపీ అధికారులు వివరించారు. అయితే, తెలంగాణలో డిసెంబర్ 3న (ఆదివారం) ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున సమావేశం వాయిదా వేయాలని ఆ రాష్ట్ర అధికారుల అభ్యర్థన మేరకు ఈ నెల 6న (బుధవారం) మరోసారి సమావేశం కానున్నారు. కాగా, అప్పటివరకూ సాగర్ నీటి విడుదల కొనసాగుతుండగా, కేఆర్ఎంబీ అభ్యర్థన మేరకు ఏపీ అధికారులు నీటి విడుదలను ఆపేశారు.
పోటా పోటీ కేసులు
అటు, ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల పోలీసులు పోటా పోటీగా కేసులు నమోదు చేసుకున్నారు. ఏపీ పోలీసులు తమపై దాడి చేసి సాగర్ డ్యాంపైకి అక్రమంగా చొరబడ్డారని తెలంగాణ భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, అనుమతి లేకుండా సాగర్ నీటిని విడుదల చేశారని, ఏపీ ఇరిగేషన్ అధికారులపైనా తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ 2 కంప్లైంట్స్ పై నాగార్జున సాగర్ పీఎస్ లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులపై ఏపీ ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.