(Source: ECI/ABP News/ABP Majha)
KTR Letter: కేంద్రానికి కేటీఆర్ లేఖ.. బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
కేంద్రానికి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు.
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. పారిశ్రామిక మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించాలని లేఖలో కోరారు. తెలంగాణలో పురపాలక శాఖ నుంచి పలు ప్రాజెక్టులు చేపడుతున్నామని.. దానికి నిధులు కావాలని పేర్కొన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీ అభివృద్ధికి, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌కు నిధులివ్వాలని లేఖలో కోరారు.
ఇండస్ట్రియల్ కారిడార్ల విషయంపైనా కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. ఇండస్ట్రియల్ కారిడార్లోని 3 రోడ్లకు రూ.6 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్ -విజయవాడ పారిశ్రామిక నడవాకు సంబంధించి ప్రతిపాదనలు ఇస్తామని కేటీఆర్ అన్నారు. అయితే వీటికి సంబంధించి.. రూ.1500 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలని కోరారు.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గతంలోనూ నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో మున్సిపల్ శాఖ పరిధిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, పనులకు గానూ కేంద్ర వాటా కోరారు. అందుకు గానూ వచ్చే కేంద్ర బడ్జెట్‌లో రూ.7,778 కోట్లు కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. కేపీహెచ్‌బీ-కోకాపేట్-నార్సింగి కారిడార్, వరంగల్ మెట్రో-నియో ప్రాజెక్ట్‌తో పాటు మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎమ్మార్‌టీఎస్), మెట్రో నియో నెట్‌వర్క్‌తో సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులకు కేంద్రం తరపున నిధులు కోరారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) రెండో విడత, మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌తో పాటు ఈస్ట్ వెస్ట్ ఎక్స్‌ప్రెస్ వే, ఎలివేటెడ్ కారిడార్ల అభివృద్ధి, ఎస్టీపీ ప్రాజెక్ట్‌లు, హైదరాబాద్‌లో ఫేజ్-1 మురుగునీటి నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌లు, ఔటర్ రింగ్ రోడ్ వరకు కవర్ చేసే STP ప్రాజెక్ట్‌లు, నగరంలో మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం వంటివి పేర్కొన్నారు.
కేంద్రం నుండి నిధులు కోరిన ప్రతి ప్రాజెక్ట్ వివరాలను లేఖలో వివరించారు. ఎమ్మార్టీఎస్ ప్రాజెక్టు కోసం ప్రాథమిక అంచనాలు రూ.3,050 కోట్లు అని కేటీఆర్ తెలిపారు. రూ.450 కోట్లతో పని చేసే ప్రాజెక్ట్ వ్యయంలో 15 శాతం మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కేటీఆర్ కోరారు.
2030 నాటికి ఎమ్మార్టీఎస్ ప్రాజెక్టు 5 లక్షల మంది ప్రయాణికుల అంచనాతో సుమారు 30 కిలో మీటర్లకు విస్తరించనుందని మంత్రి సూచించారు. ఇది నార్సింగిలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌తో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రస్తుత మెట్రో నెట్‌వర్క్‌తో కూడా అనుసంధానం అవుతుందని చెప్పారు. వరంగల్ మెట్రో-నియో ప్రాజెక్టుకు రూ.184 కోట్లు (20 శాతం) కావాలని కోరుతూ, టైర్-2 నగరంలో ప్రజా రవాణాలో ఈ ప్రాజెక్ట్ ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే కేంద్ర విధానానికి అనుగుణంగా తెలంగాణలో మెట్రో-నియో కోచ్‌లను తయారు చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోందని గతంలో రాసిన లేఖలో కేటీఆర్ వివరించారు.
Also Read: Minister Harish Rao: ప్రతి నియోజకవర్గానికి దళితబంధు.. ఏ గ్రామాన్ని ఎంపిక చేయాలనే నిర్ణయం వారిదే