Jagtial Lottery : కూటి కోసం వెళ్లి కోటీశ్వరుడయ్యాడు, జగిత్యాల యువకుడికి రూ.30 కోట్ల లాటరీ
Jagtial Lottery : జగిత్యాలకు చెందిన యువకుడికి దుబాయ్ లో రూ.30 కోట్ల లాటరీ తగిలింది.
Jagtial Lottery : జగిత్యాల యువకుడికి దుబాయిలో భారీ లాటరీ తగిలింది. బతుకుదెరువు కోసం వెళ్లిన ఓ యువకుడికి లక్కు కలిసొచ్చింది. ప్రతి రూపాయి కోసం నిత్యం కష్టపడే ఆ యువకుడి జీవితాన్ని ఆ ఒక్క లాటరీ మార్చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. జగిత్యాల యువకుడు అజయ్ కు దుబాయ్‌లో రూ. 30 కోట్ల లాటరీ తగిలింది. అజయ్ స్వగ్రామం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు. దుబాయ్‌లోని ఓ కంపెనీలో అజయ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 30 దిర్హమ్స్‌తో రెండు లాటరీ టికెట్లను కొన్నాడు అజయ్. ఈ టికెట్లకు రూ. 30 కోట్ల లాటరీ తగలడంతో అజయ్ సంతోషంలో మునిగిపోయాడు.
ఎమిరేట్స్ డ్రాలో రూ.30 కోట్లు గెలుపు
ఉన్న ఊరిలో ఉపాధి లేక దుబాయ్ వెళ్లిన ఆ యువకుడిని అదృష్టం వరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రాత్రికి రాత్రి రూ.30 కోట్లకు యజమాని అయ్యాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగుర్ కు చెందిన ఓగుల దేవరాజం- ప్రమీల ల కుమారుడు అజయ్ బతుకుదెరువు కోసం ఇటీవల దుబాయ్ కి వలస వెళ్లాడు. అక్కడ డ్రైవర్ గా పనిలో చేరాడు. దుబాయ్ లో 15 దిర్హమ్ లతో ఎమిరేట్స్ డ్రాలో లాటరీ టికెట్ కొన్నాడు. డ్రాలో అదృష్టం తననే వరించిందన్న విషయం తెలుసుకున్న అజయ్ స్వగ్రామంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అజయ్ కి రూ.30 కోట్లు డ్రా గెలుచుకోవడం పట్ల అతని బంధువులు, మిత్రులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
(అజయ్)
"నేను దుబాయ్ వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ లీగల్ గా ఉన్న ఎమిరేట్స్ డ్రాలో నంబర్లు తీశాను. ఇందులో దుబాయ్ మనీ 15 మిలియన్లు తగిలింది ఇది ఇండియన్ మనీలో రూ.30 కోట్లు వరకూ ఉంటుంది." - అజయ్
ఇలాంటి ఘటనే
ఇలాంటి ఘటనే 2019లో చోటుచేసుకుంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన కార్మికుడిని లక్ష్మీదేవీ వరించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన రిక్కాల విలాస్‌కు లక్కు కలిసొచ్చింది. అరకొర సంపాదనతో నెట్టుకొస్తున్న అతడికి లక్కీ లాటరీ వరించింది. లక్కీ లాటరీ పేరుకు తగ్గట్టుగానే విలాస్ జీవితంలో వెలుగునింపింది. ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన విలాస్‌కు ఉద్యోగం దొరక్క తిరుగు ప్రయాణంలో ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ లాటరీ టికెట్ అదృష్టం రూపంలో అతడి తలుపు తట్టింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన రిక్కాల విలాస్, పద్మలకు ఇద్దరు కూతుళ్లు. అయితే వీరి కుటుంబం జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. ఆ క్రమంలో ఆదాయం సరిపోవడం లేదని విలాస్ 2019లో దుబాయ్‌కు వెళ్లాడు. కానీ అక్కడ ఉద్యోగం దొరకలేదు. తిరిగి స్వదేశానికి తిరిగొచ్చాడు. అయితే దుబాయ్ ఎయిర్‌పోర్టులో ప్రతినెల బిగ్ టికెట్ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. దాదాపు రూ.28 కోట్లకు పైగా ప్రైజ్‌మనీ ఇస్తారు. ఆ క్రమంలో దుబాయ్‌లో విలాస్ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. దుబాయ్‌లో ఉద్యోగం దొరక్క తిరిగి ఇండియాకు వస్తున్నప్పుడు ఓ టికెట్ కొన్నాడు. తన దగ్గర డబ్బులు లేకపోతే భార్య పద్మ దగ్గర 20 వేల రూపాయలు అడిగి తీసుకుని మరీ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ డబ్బులు దుబాయ్‌లోని తన మిత్రుడికి పంపి మూడు టికెట్లు కొనుగోలు చేశాడు విలాస్. అయితే అందులో ఒక టికెట్‌కు భారీ లాటరీ తగిలింది. ఈ టికెట్ కు ఏకంగా రూ.28 కోట్ల 40 లక్షలు తగిలాయి. దీంతో విలాస్ జీవితం మారిపోయింది.