TS High Court On Immersion: హుస్సేన్‌సాగర్‌ని కాలుష్యం చేయమని మేం చెప్పలేం.. నిమజ్జనంపై తీర్పును సవరించేది లేదు..
గణేశ్ నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. తీర్పును సవరించేందుకు ఏసీజే జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం ఇచ్చిన తీర్పును సవరించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై జీహెచ్‌ఎంసీ అధికారులు రివ్యూ పిటిషన్ వేశారు. ఏసీజే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. తీర్పును సవరించేందుకు నిరాకరించిన హైకోర్టు... నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. గతేడాదే చెప్పామని.. అయినా సీరియస్ గా తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఈ ఉదయం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. పరిస్థితులను అర్థం చేసుకొని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పరిస్థితులన్నీ ప్రభుత్వం సృష్టించుకున్నవేనని వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని..కోర్టులది కాదని స్పష్టం చేసింది.
నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదు? అని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు తీర్పు ఇచ్చాక ఇప్పుడు గుర్తించారా? అని అడిగింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందని వెల్లడించింది. చట్టాలను ఉల్లంఘిస్తారా..? అమలు చేస్తారా? ప్రభుత్వం ఇష్టమని పేర్కొంది. తీర్పులో జోక్యం చేసుకొని సవరించలేమని స్పష్టం చేసింది. హుస్సేన్‌సాగర్‌ని కాలుష్యం చేయమని చెప్పలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
ఏం జరిగిందంటే..
ట్యాంక్‌బండ్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. తీర్పులో ఉన్న నాలుగు అంశాలను తొలగించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, హుస్సేన్‌సాగర్, జలాశయాల్లో నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ట్యాంక్‌బండ్ వైపు నుంచి విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని, కృత్రిమ రంగుల్లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలను తొలగించాలని కోరారు. రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని రివ్యూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ట్యాంక్‌బండ్‌కు అనుమతించకపోతే నిమజ్జనాలు పూర్తవడానికి ఆరు రోజులు పడుతుందన్నారు. రబ్బరు డ్యాం నిర్మాణానికి కొంత సమయం అవసరమవుతుందని పేర్కొన్నారు. నగరంలో వేలసంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని, అయితే విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవన్నారు. పెద్ద విగ్రహాలను కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమవుతుందని చెప్పారు.
ఇప్పటికే హుస్సేన్‌సాగర్ వద్ద క్రేన్లు, తదితర ఏర్పాట్లు చేశామని, దీనికి సంబంధించి నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఇప్పుడు వాటిని మార్చితే గందరగోళం తలెత్తుతుందని పేర్కొన్నారు. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలను తొలగిస్తామని తొలగిస్తామని, మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పారు. విగ్రహాలను ఆపితే నిరసన చేపడతామంటున్నారని.. రోడ్లపైనే వాహనాలు ఆపాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పిలుపునిచ్చిందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిమజ్జనంపై మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తుతుందన్నారు.
అంతకుముందు హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే..
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై రెండేళ్లగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. కానీ, జీహెచ్‌ఎంసీ మాత్రం ఆ దిశగా ప్రత్యామ్నాయాలు చేయలేదు. దీంతో ఈసారి నిమజ్జనంపై హైకోర్టు స్పష్టమైన ఆంక్షలతో ఆదేశాలిచ్చింది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని ఆదేశించింది. కృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయొచ్చని పేర్కొంది. అది కూడా ట్యాంక్ బండ్ వైపు నుంచి విగ్రహాల నిమజ్జనం చేయొద్దని.. పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వైపు నుంచి నిమజ్జనాలు చేసుకోవాలని సూచించింది. సాగర్‌లో ప్రత్యేక రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసి, అందులో నిమజ్జనం చేయాలని సూచన చేసింది.