Telangana Talli Statue: పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లికి అధికారికంగా విగ్రహమే లేదు - అసెంబ్లీలో సంచలన విషయం బయట పెట్టిన మంత్రి పొన్నం !
Telangana: తెలంగాణ తల్లికి అధికారిక విగ్రహాన్ని పదేళ్లలో కేసీఆర్ పెట్టలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. తాము తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడం కాదని కొత్తగా రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు.
Telangana Assembly: తెలంగాణ తల్లి విగ్రహ రూపు రేఖల్లో మార్పులు చేయడంపై బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహిస్తోంది. కానీ బీఆర్ఎస్‌కు షాకిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే అసలు పదేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ..ఎప్పుడూ తెలంగాణ తల్లి విగ్రహం గురించి కనీస ఆలోచన చేయలేదు. అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే అధికారికంగా తెలంగాణ తల్లి రూపం లేదు. ఈ విషయాన్ని అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఇప్పటి వరకూ ధికారిక రూపం లేని తెలంగాణ తల్లి
తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పులు చేస్తున్నారన్న వాదన కరెక్ట్ కాదని అసలు తెలంగాణ తల్లికి ఇంత వరకూ అధికారికంగా ఒక రూపాన్ని ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ భవన్ లో ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఉద్యమ సమయంలో తీర్చిదిద్దారు. ఆ విగ్రహాన్ని తెలంగాణ భవన్‌లో పెట్టారు. అయితే ఆ విగ్రహ నమూనాను అధికారికం చేయలేదు. దీంతోనే సమస్యలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఉత్సవాలు చేయాలనుకున్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అధికారికంగా లేదు. తెలంగాణ పాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం ఏమిటని .. ప్రతిష్టించాలని అనుకున్నప్పుడు తెలంగాణ తల్లిరూపం ఎలా ఉండాలన్న చర్చ వచ్చింది. అప్పుడే రేవంత్ నిపుణులతో చర్చించి బహుజనుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్దం చేయించారని చెబుతున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దామని ప్రభుత్వం చెబుతోంది. కేసీఆర్ గతంలో రూపొంచిన విగ్రహానికి అధికారిక రూపు ఇవ్వాడనికి కూడా అవకాశం లేదని దొరల సంస్కృతితో ఉన్న విగ్రహం కన్నా బహుజన తల్లిని తెలంగాణ తల్లిగా మారుస్తామని గతంలోనే రేవంత్ప ప్రకటించారు. అయితే తాము సిద్ధం చేసిందే అసలైన తెలంగాణ తల్లి అని.. తెలంగాణ అస్థిత్వం అంతా ఆ విగ్రహంలోనే ఉందని బీఆర్ఎస్ వాదిస్తోంది. పోటీగా మేడ్చల్ లో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వం మాత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది డిసెంబర్ 9న ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టిన రోజు అని.. అందుకే ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదని కేవలం కాంగ్రెస్ తల్లి మాత్రమేనని అంటున్నారు. మొత్తంగా అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహానికి పదేళ్లలో బీఆర్ఎస్ అధికారిక ముద్ర వేయకపోవడం మాత్రం చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది.