Rice sales Tenders: యాసంగి ధాన్యం విక్రయ టెండర్లు రద్దు చేసే ఛాన్స్- రూ.1000 కోట్ల నష్టం వస్తుండటంతో యోచన
యాసంగి ధాన్యం విక్రయ టెండర్లను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టం వస్తుండటంతో పాత టెండర్లు రద్దు చేసి.. కొత్త టెండర్లు పిలవాలని యోచిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణలో యాసింగ్ ధాన్యం విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ చేసిన ప్రయత్నం ఫలించలేదు. మొదటి విడతలో 25 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు టెండర్లు వేసిన సంస్థలు.. అతితక్కువ ధరకు కోట్ చేసినట్టు అధికారులు గుర్తించారు. దీని వల్ల ప్రభుత్వానికి సగటున క్వింటాల్‌కు రూ.375 నష్టం వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. అంటే.. 25 లక్షల మెట్రిక్ టన్నులకు గాను.. ప్రభుత్వానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. ఆ నష్టం భరించే కంటే... టెండర్లు రద్దు చేసి.. కొత్తగా బిడ్లు ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ధాన్యం టెండర్లపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ టెండర్ల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు.. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.
గత ఏడాది అంటే 2022–23కు సంబంధించి.. తెలంగాణ రాష్ట్ర వ్యప్తంగా రైతుల నుంచి 66.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది పౌరసరఫరాల శాఖ. మొత్తం 66.85 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేసి ఉంచారు. ఆ ధాన్యంలో కొంత భాగం అకాల వర్షాల కారణంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యంతో పాటు మిగతా ధాన్యాన్ని కూడా ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు నిరాకరించారు. బాయిల్డ్ రైస్‌గా మాత్రమే ఇస్తామని చెప్పినా... కేంద్రం నిబంధనలతో అది సాధ్యం కాలేదు. దీంతో మిల్లుల్లో నిల్వ చేసిన ధాన్యాన్ని ఒకేసారి విక్రయించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా... తొలి విడత 25 ఎల్‌ఎంటీలు విక్రయించేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ధాన్యం విక్రయించే ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో 25 లక్షల మెట్రిక్ టన్నుల విక్రయానికి టెండర్లు పిలిచారు. ఈ 25 లక్షల మెట్రిక్ టన్నులను.. 25 లాట్లుగా విభజించి ఆన్‌లైన్‌లో బిడ్స్ ఆహ్వానించారు. ఒక్కో లాటు విలువ తక్కువలో తక్కువగా 200 కోట్ల రూపాయలు ఉంటుంది. ధాన్యం కొనుగోలుకు 54 సంస్థలు టెండర్ బిడ్లు దాఖలు చేశాయగా... 10 సంస్థలు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను దక్కించుకున్నాయి.
ఈ పది సంస్థలు 25 లాట్లను క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,618 నుంచి గరిష్టంగా రూ.1,732 ధరతో దక్కించుకున్నాయి. సగటున చూస్తే క్వింటాల్ ధర రూ.1,685 మాత్రమే పడుతోంది. ప్రభుత్వం రైతుల నుంచి క్వింటాల్‌కు రూ.2,060 చెల్లించి కొనింది. దీన్ని బట్టి చూస్తే... క్వింటాల్‌కు రూ.375 చొప్పున నష్టం వస్తోంది. అంటే 25 లక్షల మెట్రిక్ టన్నులకు గాను రూ.925 కోట్ల వస్తుంది. ఇక... రైతుల దగ్గర ధాన్యం కొన్న దగ్గర నుంచి... మిల్లుల్లో భద్రపరిచే పరిచే వరకు కావాల్సిన అవసరాలకు ప్రభుత్వం పెట్టిన ఖర్చుతో కలిసి నష్టం రూ.వెయ్యి కోట్లు దాటేస్తోంది. ఇంత నష్టం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదు. నష్టానికి టెండర్లు ఓకే చేసే కంటే... ఈ టెండర్లను రద్దు చేసి.. కొత్తగా టెండర్లు పిలవాలన్నది ప్రభుత్వ యోచన. అయితే.. ఇందులో సాధ్యాసాధ్యాలను కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ధాన్యం విక్రయ టెండర్లపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.