Telangana News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - ఎకరానికి రూ. పదివేలు పంపిణీ తేదీ ఫిక్స్ !
తెలంగాణ రైతులకు అకాల వర్షాల పంట నష్ట పరిహారం విడుదలకు తెలంగాణ సర్కార్ తేదీ ఖరారు చేసింది.
Telangana News : అకాల వర్షాల వల్ల పంట కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ. పదివేలు పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఆ నగదును పంపిణీ చేసే తేదీని ఖరారు చేసింది. పన్నెండో తేదీ నుంచి రైతులకు సాయం పంపిణీ చేయనున్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను గతనెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చి పరిశీలించారు. రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎకరానికి 10 వేలరూపాయలచొప్పున పంటనష్టపరిహారాన్ని అందిస్తామని ప్రకటించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. పంటనష్టపరిహారంకు సంబంధించిన చెక్కులను ఈనెల 12 నుంచి రైతులకు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సీఎం కేసీఆర్ ప్రకటించినా ఇంత వరకూ పరిహారం ఇవ్వడం లేదంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అదే సమయంలో వర్షాలు కూడా ఆగడం లేదు. వర్షాలు తెరిపినిచ్చిన తర్వాత బాధిత రైతులందరికీ ఒకే సారి నగదు పంపిణీ చేయనున్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం ఇవ్వనున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే నష్టపోయిన కౌలు రైతుల వివరాలను ప్రభుత్వానికి అందించారు. అకాల వర్షాలు రైతాంగాన్ని అపార కష్ట నష్టాల్లోకి నెడుతున్నాయి. ఎండా కాలంలో కూడా వానలు దంచికొడుతున్నాయి. ఎక్కడి ధాన్యం అక్కడే తడిసిపోతున్నది అయితే, రైతులు ఆ ధైర్యపడవద్దని ప్రభుత్వ పెద్దలు భరోసా ఇస్తున్నరు.