Revanth Reddy Comments: కేసీఆర్‌కు ముదిరాజ్ బిడ్డలు అక్కర్లేదా? ఒక్క టికెట్టూ ఇవ్వలేదు - రేవంత్ రెడ్డి
Revanth Reddy: కాంగ్రెస్ ముదిరాజ్ లకు నాలుగు టికెట్లు ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. ముదిరాజ్ లకు కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించిందని అన్నారు.
తెలంగాణలో ఉన్న మొత్తం 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఒక్క ముదిరాజ్ బిడ్డకు కూడా టికెట్ ఇవ్వలేదంటే ఆయనకు వాళ్ల ఓట్లు అక్కర్లేదన్నట్టేనా అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, కాంగ్రెస్ ముదిరాజ్ లకు నాలుగు టికెట్లు ఇచ్చిందని అన్నారు. ముదిరాజ్ లకు కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించిందని అన్నారు. నియోజకవర్గంలో ఇసుక దందా, భూ ఆక్రమణలు ఎక్కడ జరిగినా ఇక్కడి ఎమ్మెల్యే పాత్ర ఉంటుందని అన్నారు. సంక్షేమ పథకాల్లోనూ కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే కు కప్పం కట్టనిదే ఏ పనీ జరగడం లేదు. మక్తల్ కు ఎమ్మెల్యే చేసిందేం లేదు. ఇసుక దోపిడీ, భూ ఆక్రమణ, పేదలను గన్ మెన్ లను మెడపట్టి గెంటించడమా ఈ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి? నువ్వు మెడపట్టి గెంటడం కాదు.. ప్రజలే నిన్ను మెడపట్టి ఈడ్చేస్తారు. రైతులకు ఉచిత కరెంటు పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్. 24 గంటల కరెంటు ఇస్తున్నామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎవరొస్తారో రండి.. సబ్ స్టేషన్ కు వెళ్లి లాగ్ బుక్ లు చూద్దాం. 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే మేం ఎమ్మెల్యేలుగా నామినేషన్ వేయం. అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు.
మీ కల్లబొల్లి కబుర్లు నమ్మడానికి రైతులు సిద్ధంగా లేరు. రెండు సార్లు అధికారం ఇస్తే లక్ష కోట్లు దోచుకున్నారు.. మూడోసారి ఇస్తే ఇంకో లక్ష కోట్లు దోచుకుంటారు. మూడోసారి అధికారం ఇస్తే ఇంట్లో తన మనవడికి కూడా పదవి ఇచ్చుకుంటాడు. గుడినీ గుడిలో లింగాన్ని మింగే వాడుంటాడని విన్నాం.. ఇప్పుడు కేసీఆర్ ను చూస్తున్నాం. బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ బెల్టుషాపుల తెలంగాణ చేసిండు. గ్రూపులు గుంపులు పక్కనబెట్టి అంతా ఏకమై పాలమూరులో 14 కు 14 సీట్లు గెలిపించాలి. అప్పుడే పాలమూరు జిల్లా అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది.