Telangana Elections 2023: 'బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయం' - మళ్లీ అధికారమిస్తే దోచుకుంటారని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
Amit Shah Comments: బీఆర్ఎస్ పదేళ్ల పాలన అంతా అవినీతిమయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. వారికి మళ్లీ అధికారం ఇస్తే ప్రజల సొమ్ము దోచుకుంటారని మండిపడ్డారు.
Amit Shah Salms CM KCR: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు ఆదాయం ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో దివాలా తీసిందని కేంద్రం హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పదేళ్ల పాలనలో అవినీతి తప్ప ఏం చేయలేదని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజు వేలంలో, కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులోనూ భారీగా అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తే ప్రజల సొమ్ము దోచుకుంటారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పారు. వరికి క్వింటాల్ కు రూ.3,100 చెల్లిస్తామని, పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని పేర్కొన్నారు. ఆడపిల్లల పేరు మీద రూ.2 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తామని స్పష్టం చేశారు. పదేళ్లలో తెలంగాణకు రూ.2.50 లక్షల కోట్లు ఇచ్చినట్లు వివరించారు. యువత, దళితులు, వెనుకబడిన వర్గాలు చాలా అసంతృప్తితో ఉన్నారని, ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
'ఉద్యోగాల పేరుతో మోసం'
సీఎం కేసీఆర్ పాలనలో ఉద్యోగాల పేరుతో మోసం చేశారని, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని గొప్పగా చెప్పి పూర్తి చేయలేదని అమిత్ షా మండిపడ్డారు. 'నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇవ్వలేదు. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేసి కుంభకోణానికి పాల్పడ్డారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ ఇప్పటివరకూ పూర్తి చేయలేదు. 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కలగానే మిగిలింది. తెలంగాణ విమోచన దినోత్సవం కూడా నిర్వహించడం లేదు. ఎంఐఎంకు భయపడి ముస్లిం రిజర్వేషన్లు కల్పించారు.' అని విమర్శించారు. డబుల్ బెడ్రూం, దళిత బంధు పథకాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసినా మిషన్ కాకతీయ పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు.
'ఆ మూడూ కుటుంబ పార్టీలే'
తెలంగాణలో గత పదేళ్లుగా కుటుంబ పాలనే నడిచిందని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడూ కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో వీరి జెండాలు వేరైనా అజెండా ఒకటేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లను గెలిపిస్తే, వారు వెళ్లి బీఆర్ఎస్ లో కలుస్తారని పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటాలు చేసి, 1200 మంది యువత బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకమైనవని, మీ ఓటు తెలంగాణ, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం చేసే బాధ్యత తాము తీసుకుంటామని, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని పునరుద్ఘాటించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply
Also Read: Telangana Elections 2023: 'ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించొద్దు' - సీఎం కేసీఆర్ కు ఈసీ లేఖ