CM KCR Wishes: ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు - తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
CM KCR Wishes: తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అందరి ఇళ్లల్లోనూ సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 'దసరా' సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ రోజు కుటుంబమంతా ఒకేచోట చేరి సామూహికంగా సంబురాలు చేసుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. శమీపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించడం, అలాయ్ బలాయ్ తో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, దసరా రోజు పాలపిట్టను దర్శించడం తెలంగాణ ప్రాంత ప్రత్యేకతకు నిదర్శనమని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, దేశంలో అభివృద్ధి పథాన కొనసాగించేందుకు విజయదశమి స్ఫూర్తితో అలుపెరగని కృషి కొనసాగుతుందన్నారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని, సుఖ సంతోషాలు కలగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
రేవంత్ రెడ్డి విషెష్
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వైభవంగా జరుపుకొనే ఈ పండుగ అందరి ఇళ్లల్లో సంతోషం నిండాలని, ఆనందం పంచాలని ఆకాంక్షించారు.
ఘనంగా బతుకమ్మ సంబురాలు
మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబురాలను ప్రజలందరూ వైభవంగా నిర్వహించారు. భాగ్యనగరం మొదలు మారుమూల గ్రామాల వరకూ ప్రతి ఇంటా బతుకమ్మ సంబురాలు మిన్నంటాయి. బంతి, తంగేడు, చామంతి, గునుగు, గులాబీ, మందారం, కలువలు, ఇలా అన్ని రకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మకు పూజలు చేశారు. సాయంత్రం డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా బతుకమ్మలను ఓ చోట చేర్చి ఆడిపాడారు. అనంతరం, చెరువులు, జలాశయాల్లో నిమజ్జనం చేశారు. 'సల్లంగా సూడు బతుకమ్మ.. ఇక సెలవు, వచ్చే ఏడాది మళ్లీ రావమ్మా' అంటూ బతుకమ్మను సాగనంపారు.
ఉమ్మడి ఉత్సవాలు
తెలంగాణ అమరుల స్మారక చిహ్నం వద్ద వేడుకలను రాష్ట్ర సీఎస్ శాంతికుమారి ప్రారంభించారు. ఈ వేడుకలో ఐఏఎస్ అధికారిణులు, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు, జీహెస్ఎంసీలు ఉమ్మడిగా వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, సిద్ధిపేట, నిజామాబాద్, సిద్ధిపేట, మేడ్చల్ జిల్లాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి.
తెలంగాణ సంస్కృతి చాటి చెప్పే పండుగ
తెలంగాణ ఐక్య సంస్కృతిని చాటి చెప్పే పండుగ, చారిత్రక విశిష్ట వేడుక బతుకమ్మ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'పుడమి పులకరించే, సింగిడి రంగుల పువ్వుల వైభవం. ప్రకృతి పరవశించే తీరొక్క వర్ణాల బతుకు సంబురం, పువ్వులు, నవ్వులు విరబూసే సహజీవనం సౌందర్యం. నిండిన చెరువుల నీటి అలలపై ఉయ్యాలలూగే గౌరమ్మలు. పచ్చని పంట చేనుల దారుల్లో పూల తేరులు. ఇదీ బతుకమ్మ సంబురం.' అంటూ పండుగ వైభవాన్ని కేటీఆర్ అభివర్ణించారు.
ప్రకృతిని పూజించే పండుగ
బతుకమ్మ పండుగ ఎంతో విశిష్టమైనదని, ప్రకృతి, పువ్వులను పూజించే గొప్ప వేడుక అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులు ఈ వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సిద్ధిపేట కోమటిచెరువు వద్ద ఆదివారం రాత్రి ఆయన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగ, సంస్కృతిని గుర్తించలేదన్నారు. గతంలో సాగునీటి వెతలు, కరెంట్ కోతలు, ఎరువుల కష్టాలు వంటి దుస్థితి ఎదుర్కొన్నామని, ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు.
కాంగ్రెస్ పాలనలో చెరువుల్లో నీళ్లు కనిపించేవి కాదని, బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు పోయాల్సిన దుస్థితి ఉండేదని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జల వనరులు నిండుగా ఉన్నాయని పేర్కొన్నారు.