Paidi Jairaj Birth Anniversary: దిగ్గజ నటుడు పైడి జైరాజ్ తెలంగాణవాడు కావడం గర్వకారణం: కేసీఆర్
KCR Comments: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ జయంతి సందర్భంగా కేసీఆర్ నివాళి అర్పించారు. పైడి జైరాజ్ తెలంగాణ సినిమా రంగానికి మూల పురుషుడిగా వ్యవహరించారు.
KCR Comments: తెలంగాణ గడ్డపై పుట్టి, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగి, తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్ బిడ్డ.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పైడి జైరాజ్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
తెలంగాణ సినిమా రంగానికి మూల పురుషుడు
పైడి జైరాజ్ 113వ జయంతి (సెప్టెంబర్ 28) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. జాతీయ చలన చిత్ర పరిశ్రమకు పైడి జైరాజ్ అందించిన సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. భారతీయ సినిమా తొలి దశలో ప్రారంభమైన మూకీల నుండి టాకీల వరకు సాగిన పైడి ప్రస్థానం గొప్పదన్నారు. భారతీయ వెండి తెరపై మొట్ట మొదటి యాక్షన్ హీరో పైడి జైరాజ్ కావడం తెలంగాణకు గర్వ కారణమని, సీఎం కేసీఆర్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకా వేల్లూనుకోని ప్రారంభ దశ నాటికే, బాలీవుడ్ లో పైడి జైరాజ్ అగ్ర హీరోగా రాణించడం గొప్ప విషయం అని అన్నారు. తనదైన నటనాకౌశలంతో పాటు,దర్శకునిగా, నిర్మాతగా రాణించి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి తరం తెలంగాణ సినిమా నటుడు పైడి జైరాజ్.. తెలంగాణ సినిమా రంగానికి మూల పురుషుడని సీఎం కొనియాడారు.
300లకు పైగా సినిమాలు..
హిందీలో మాత్రమే కాకుండా మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం పలు జాతీయ భాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి భారతీయ సినిమా పరిశ్రమలో శిఖర సమానుడిగా నిలిచారని సీఎం అన్నారు. తెలంగాణ నేల నుండి దేశం గర్వించ దగ్గ స్థాయిలోకి ఎదిగిన గొప్ప వారిలో పైడి ఒకరని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తుగా, రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతి లోని సమావేశ మందిరానికి పైడి జై రాజ్ ప్రివ్యూ థియేటర్ గా పేరు పెట్టుకుని గౌరవించుకున్నామని సీఎం గుర్తు చేశారు.
స్వరాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వ కృషితో తెలంగాణ యాస భాషా సంస్కృతులకు సినీ పరిశ్రమలో ప్రాముఖ్యత, సాహితీ గౌరవం పెరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సాంస్కృతిక శాఖ ద్వారా, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ యువత సినిమా పరిశ్రమలో పలు విభాగాల్లో గొప్పగా రాణిస్తున్నదని సీఎం తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ సినిమా రంగం మరింతగా రాణించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
ఒక్క తెలుగు సినిమాలోనూ నటించని జైరాజ్
పైడి జైరాజ్ 1909 సెప్టెంబర్ 28వ తేదీన కరీంనగర్ లో జన్మించారు. 156 చిత్రాల్లో కథానాయకుడి పాత్రలతో పాటు మొత్తం 300 లకు పైగా మూకీ, టాకీ సినిమాల్లో నటించారు. భారత కోకిల సరోజినీ నాయుడు జైరాజ్ కు మేనత్త అవుతారు. ఆయన నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా 1962, ఫిబ్రవరి 24న విడుదల అయింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదల అయింది. నటుడిగానే కాకుండా మొహర్, మాలా, ప్రతిమ, సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు వాడై ఉండి కూడా పైడి జైరాజ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేకపోయారు.