Telangana Budget: విద్యకు మహర్దశ, రాష్ట్ర బడ్జెట్ స్పీచ్‌లో మంత్రి హరీష్‌రావు కీలక ప్రకటనలు
Education In Telangana Budget: 12 సూత్రాలతో మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం రెండు కొత్త యూనివర్శిటీల ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
Telangana Budget: తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి ధ్యేయంగా పల్లె ప్రగతి అనే పేరుతో ప్రత్యేక కార్యచరణను చేపట్టింది. 1994లో రూపొందించిన పంచాయతీరాజ్ చట్టంలోని లోపాలు సవరించి 2018లో కొత్త పంచాయతీ రాజ్ చట్టానికి రూపకల్పన చేశామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా గ్రామ పంచాయతీల సంఖ్యను 12,769కి పెంచింది.
తెలంగాణ ప్రభుత్వం పల్లెల స్వరూపాన్ని మార్చేసిందన్నారు హరీష్ రావు. చెత్త సేకరణతోపాటు వ్యవర్థాల నిర్వహణ కోసం ప్రతి ఊరికి ఒక డంపు యార్టును ఏర్పాటు చేశామన్నారు. 330 కోట్ల ఖర్చుతో కొత్త విద్యుత్ స్తంభాలను అర్చిందన్నారు. అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పుట చేసినట్టు పేర్కొన్నారు. మొక్కలు పెంపకం కోసం ప్రతి గ్రామంలో తప్పనిసరిగా నర్సరీలను ఏర్పాటు చేసిందన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ కోసం గతంలో రాష్ట్రావ్యాప్తంగా 84 ట్రాక్టర్లు మాత్రమే ఉండేవని... ఇప్పుడు వాటి సంఖ్య 12, 769కి పెరిగినట్టు హరీష్ పేర్కొన్నారు.1547 కోట్ల భారీ వ్యయంతో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించింది ప్రభుత్వం. ప్రతి నెల గ్రామ పంచాయతీల నిర్వాహణకు నేరుగా 227.5 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నామన్నారు.
సన్సద్ ఆదర్శ గ్రామ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో తొలి పది ర్యాంకులు తెలంగాణ పంచాయతీలే ఉన్నాయని గుర్తు చేశారు హరీష్ రావు. గందగీ ముక్త్ భారత్ అవార్డుల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సశక్తీకరణ్ అవార్డుల్లో సంగారెడ్డి జిల్లా పరిషత్‌తోపాటు కోరుట్ల, ధర్మారం మండల పరిషత్తులు, ఆరు గ్రామ పంచాయతీయలకు ఆవార్డులు వచ్చిన విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఉంటంకించారు.
పల్లెలను మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు పల్లె ప్రగతి ప్రణాళిక కోసం 3330 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు తెలిపారు హరీష్ రావు.
పట్టణాలను ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేయడానికి కూడా పట్టణ ప్రగతి అనే పథకం తీసుకొచ్చింది ప్రభుత్వం. మున్సిపాలిటీలకు ప్రతి నెల ఠంఛన్‌గా నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపారు హరీష్ రావు. ప్రతి ఇంటికి నల్లా నీరు ఇస్తామన్నారు. టీఎస్- బీపాస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణ అనుమతుల ప్రక్రియ సులభతరంమైందన్నారు. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంచేందుకు 1602 నర్సరీలు ఏర్పా టు చేసినట్టు తెలిపారు. ఈ వార్షిక బడ్దెట్‌లో పట్టణ ప్రగతి ప్రణాళిక కోసం 1394 కోట్ల రూపాయలను ప్రతిపాదించింది ప్రభుత్వం.
విద్యారంగాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏకరవు పెట్టిన ఆర్థికమంత్రి హరీష్‌రావు... అన్ని వర్గాలను విద్యా వంతులుగా చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.
మొదటి దశలో గురుకుల విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం రెండో దశలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు హరీష్. మన ఊరు మనబడి అనే బృహత్తర పథకాన్ని ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7, 289 కోట్ల రూపాయలతో దశలవారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతుందన్నారు. గ్రామస్థాయిలో మన ఊరు మనబడి అనే పేరుతో, పట్టణాల్లో మన బస్తీ-మన బడి పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నారు.
మొదటి దశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యచరణ ప్రారంభించింది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో తొలి దశ కార్యక్రమం అమలవుతుంది.
విద్యా సంస్థల్లో పన్నెండు రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.
1. డిజిటల్ విద్య అమలు
2. విద్యుదీకరణ
3. తాగునీటి సరఫరా
4. సరిపడా ఫర్నీచర్
5. పాఠశాలలకు మరమ్మతులు
6. పాఠశాలలకు రంగులు వేయడం
7. గ్రీన్ చాక్ బోర్డుల ఏర్పాటు
8.ప్రహరీ గోడల నిర్మాణం
9. కిచెన్ షెడ్డుల నిర్మాణం
10.అదనపు తరగతుల నిర్మాణం
11. ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణం
12. నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం
ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందన్నారు హరీష్ రావు. దీని కోసం రాష్ట్రంలో మొదటి మహిళా యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. యూనివర్సిటీ కోసం వంద కోట్లు ప్రతిపాదించారు. కొత్తగా అటవీ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం మరో వంద కోట్లు ప్రతిపాదించింది.