(Source: ECI/ABP News/ABP Majha)
Revanth Vs KTR: అసెంబ్లీలో రేవంత్ Vs కేటీఆర్: ఇరు నేతల మధ్య మాటల యుద్ధం!
Revanth Reddy News: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. ఒకరికొకరు కౌంటర్లు వేసుకుంటూ ఎద్దేవా చేసుకున్నారు.
Telangana Assembly News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు (జూలై 24) ప్రధానంగా కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి కేటాయించిన నిధుల అంశంపైనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే కేటీఆర్ - రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. రేవంత్ రెడ్డి సభలో ఉండి కూడా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మాట్లాడించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం అన్ని విషయాల్లో చాలా స్పష్టతతో ఉందని.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏ నిధులు రాకపోవడంపై చర్చకు అనుమతించాలని కోరామని చెప్పారు.
అయితే, కేటీఆర్ సభకు లేట్‌గా వచ్చి.. అసలు విషయం తెలుసుకోకపోతే ఎలా అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇక్కడ ఇంత పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు మీ అధినేత కేసీఆర్ ఎక్కడ.. పదేళ్లు నేనే సీఎం, తొలి సీఎం అని చెప్పుకునే ప్రతిపక్ష నేత ఎక్కడ ఉన్నారని రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రధాని మోదీ అంటే భయంతో కేసీఆర్ ఎక్కడో దాక్కొని ఉంటారని రేవంత్ రెడ్డి అన్నారు.
మేనేజ్‌మెంట్ కోటా వర్సెస్ పేమెంట్ కోటా
దీనిపై కేటీఆర్ కాస్త గట్టిగా.. మీరు మాకు జవాబు చెప్పండి చాలు.. మీకు కేసీఆర్ అవసరం లేదు అని సమాధానం చెప్పారు. దానికి రియాక్షన్ గా రేవంత్ రెడ్డి కేటీఆర్ పై ఆగ్రహం చెందారు. నీలా నేను తండ్రి పేరు చెప్పుకొని మంత్రిని కాలేదని.. కింది స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యానని మాట్లాడారు. ‘‘కేటీఆర్ సీటు మేనేజ్‌మెంట్ కోటా అనుకున్నా. అంతకంటే దారుణం అని ఎద్దేవా చేశారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని మేమూ అనొచ్చుగా అని మాట్లాడారు. దానికి రేవంత్ మళ్లీ కౌంటర్ ఇస్తూ.. పేమెంట్ కోటాలో సీఎంను కాలేదు. మొన్న మీ బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి చీకట్లో మాట్లాడుకొని వచ్చారు అని అన్నారు. తిరిగి కేటీఆర్ స్పందిస్తూ.. తమకు ఆ అవసరం లేదని.. మీలా చీకటి ఒప్పందాలు మేం చేసుకోబోమని అన్నారు. తమను విలీనం చేయడానికి రేవంత్ రెడ్డి లాగ తాము పరాన్న జీవులం కాదని కేటీఆర్ అన్నారు. మేనేజ్‌మెంట్ కోటాలో మంత్రి అయ్యానని సీఎం అనొచ్చా? అధ్యక్షా.. సభా నాయకుడు అలా మాట్లాడడం కరెక్టేనా? అని కేటీఆర్ నిలదీశారు.
2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాణం పెడితే మోదీకి మద్దతుగా నిలిచేందుకు బీఆరెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. 2019 లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి మద్దతుగా బీఆరెస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ ప్రత్యేక విమానంలో వెళ్లి ఓటింగ్ లో పాల్గొన్నది నిజం కాదా? అసెంబ్లీ సాక్షిగా నోట్ల రద్దును కేసీఆర్ స్వాగతించారు. గొప్ప నిర్ణయమని పొగడ్తలతో ముంచెత్తింది మీరు కాదా? రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ కి అండగా నిలబడింది బీఆరెస్ కాదా?అన్నింట్లో మద్దతు పలికి పోరాటాలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలోనూ బీజేపీకి అనుకూలంగా ఉండేలా బీఆరెస్ వ్యవహరించింది.
మీ బుద్ధి మారకపోతే ఎలా?
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ బీజేపీ కి బీఆరెస్ మద్దతు పలికింది. సాగు చట్టాల విషయంలోనూ బీఆరెస్ బీజేపీకి అండగా నిలిచింది. కేంద్రం నుంచి నిధులు కాదు.. మోదీ ప్రేమ ఉంటే చాలు అని ఆనాడు తెలంగాణ ప్రజల సాక్షిగా కేసీఆర్ మాట్లాడారు. ఆదానీ, అంబానీలతో చీకట్లో కుమ్మక్కు అయ్యే అవసరం మాకు లేదు. సభ నిర్వహించేది గాలి మాటలు మాట్లాడటానికి కాదు. రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆరెస్ పదేళ్ల పాలన. ప్రతి శాఖలో బిల్లులన్నీ వాళ్లు పెండిగ్ లో పెట్టారు. మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదు. గుండుసున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా? ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ముందుకు రావాలని కోరుతున్నా’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.