Siricilla Rajaiah: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు - హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా
Telangana News: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా సిరిసిల్ల రాజయ్యను ఇటీవల ప్రభుత్వం నియమించగా.. ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
Siricilla Rajaiah As The Chairman of Telangana Finance Commission Chairman: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య (Siricilla Rajaiah) ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఎర్రమంజిల్ (Erramanzil)లోని కమిషన్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆయనతో పాటు సంకేపల్లి సుధీర్ రెడ్డి, మల్కుడ్ రమేష్, నెహ్రూ నాయక్ కమిషన్ మెంబర్స్ గా ఛార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ స్మితా సబర్వాల్ హాజరయ్యారు. గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలని రాజీవ్ గాంధీ.. ఫైనాన్స్ కమిషన్స్ ఏర్పాటు చేశారని రాజయ్య ఈ సందర్భంగా అన్నారు. గత ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ను నిర్వీర్యం చేసిందని.. నిధులు లేక గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు విలవిల్లాడుతున్నాయని మండిపడ్డారు. మూలనపడిన ఫైనాన్స్ కమిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ధరించారని.. ఆయన ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలను పునరుద్ధరిస్తామని చెప్పారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. సోమవారం నుంచే విధులు ప్రారంభిస్తానని వెల్లడించారు. కాగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటు ఆశించగా.. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చింది. ఛైర్మన్, సభ్యులు రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు.
సిరిసిల్ల రాజయ్య 15వ లోక్ సభకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఫోషించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అయితే, బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు, సిరిసిల్ల రాజయ్య కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. 2015లో ఆయన కోడలు ఆత్మహత్య కేసులో అరెస్ట్ కాగా.. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం 2022 మార్చిలో న్యాయస్థానం ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆయనకు ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ పదవి దక్కింది.
Also Read: Revanth Reddy: తెలంగాణ కోసం త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ - రేవంత్ రెడ్డి కీలక ప్రకటన