Sharmila To Delhi : డీకే శివకుమార్‌తో కలిసి ఢిల్లీకి షర్మిల - కాంగ్రెస్‌తో విలీనంపై నేడో రేపో తుది ప్రకటన ?
డీకే శివకుమార్‌తో కలిసి ఢి్లలీకి షర్మిల - కాంగ్రెస్‌తో విలీన ప్రక్రియ పూర్తి చేయబోతున్నారా ?
Sharmila To Delhi : తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతూండటంతో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో విలీనం కోసం ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ వ్యవహారాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డీల్ చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్ని ప్రియాంక గాంధీ తరపున చూసుకుంటున్న ఆయన.. చేరికలు, విలీనాల విషయంలో చురుకుగా ఉంటున్నారు. ఈ క్రమంలో గతంలో డీకే శివకుమార్ తో షర్మిల రెండు, మూడు సార్లు చర్చలు జరిపారు. మరోసారి ఆమె బెంగళూరు వెళ్లినట్లుగా తెలుస్తోంది. డీకే శివకుమార్ తో చర్చల తర్వాత ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
రెండు, మూడు రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంపై స్పష్టత
ఢీకే శివకుమార్ తో పాటు షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినాయకత్వంతో చర్చలు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. షర్మిల పార్టీని విలీనం చేసుకునే విషయంలో కాంగ్రెస్ హైకమండ్ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇతర విషయాల్లో బిజీగా ఉండటంతో ఇంకా చర్చలు ప్రారంభించలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర నేతలు మాత్రం.. షర్మిల చేరికను వ్యతిరేకిస్తున్నారు. ఆమెను ఏపీ రాజకీయాలకు పరిమితం చేయాలని తెలంగాణలో నాయకత్వం వద్దని అంటున్నారు. ఈ అంశంపై డీకే శివకుమార్ తెలంగాణ నేతలతో చర్చలు జరిపి.. ఓ క్లారిటీకి వచ్చారని అంటున్నారు. తెలంగాణ నేతల అభిప్రాయం, షర్మిల విజ్ఞప్తులను హైకమాండ్ ముందు ఉంచి ఓ నిర్ణయం తీసుకోవాలని కోరే అవకాశం ఉంది.
రాహుల్ గాంధీపై షర్మిల వరుస పొగడ్తలు
ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీని షర్మిల సోషల్ మీడియా అదేపనిగా పొగుడుతున్నారు. తాజాగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంపైనా స్పందించారు. నిజానికి రాహుల్ గాందీ లోక్‌సభ సభ్యత్వం.. సోమవారం పునరుద్ధరించారు. ఒక రోజు ఆలస్యంగా షర్మిల రాహుల్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. దీనికి కారణం.. విలీన చర్చల విషయంలో ముందుడుగు పడటమేనని భావిస్తున్నారు.
Warm congratulations to Sree @RahulGandhi ji on being reinstated as the Member of Parliament. While your unwavering grit continues to rekindle hopes among millions of people across the nation, justice took its course and delivered a verdict that gladdened many hearts.
— YS Sharmila (@realyssharmila) August 8, 2023
I am now…
తెలంగాణ నేతల స్పందనను బట్టి కీలక నిర్ణయాలు
తెలంగాణలో షర్మిల రాజకీయాలు వద్దని.. ఏపీ పీసీసీచీఫ్‌గా నియమించాలని కొంత మంది సలహా ఇస్తున్నారు. మరో వైపు షర్మిల తెలంగాణలోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. షర్మిల తాను పోటీ చేయడానికి పాలేరు టిక్కెట్ అడుగుతున్నారు. వీటన్నింటిపై ఏకాభిప్రాయం వస్తే విలీన ప్రకటన... ఈ వారంలోనే ఉండే అవకాశం ఉందంటున్నారు.