Ts Congress : మునుగోడుపై ప్రియాంకా గాంధీ సమీక్ష - డుమ్మా కొట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి !
మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ నేతలతో ప్రియాంకా గాంధీ సమీక్ష నిర్వహించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజర్ అయ్యారు.
Ts Congress : తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న ప్రియాంకా గాంధీ .. ముందుగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమయ్యారు. సోనియా గాంధీ నివాసంలో ఈ భేటీ జరిగింది. మునుగోడు ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అనే అంశాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగింది.
మునుగోడు ఉపఎన్నికల పరిణామాలపై ప్రియాంకా గాంధీ సమీక్ష
ముఖ్యంగా మునుగోడు బై పోల్ పై ఫోకస్ పెట్టిన ప్రియాంక గాంధీ... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల గురించి రాష్ట్ర నేతలను అడిగి తెలుసుకున్నారు. మునుగోడులో నిర్వహించిన టీఆర్ఎస్, బీజేపీ సభల గురించి రాష్ట్ర నేతలు ప్రియాంక గాంధీకి వివరించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్... అందుకు కావాల్సిన ప్రణాళిక రూపకల్పన గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కీ గౌడ్ , శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?
ఆహ్వానం ఉన్నా హాజరు కాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి
అనూహ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవ్వలేదు. ఆహ్వానం పంపినప్పటికీ ఆయన డుమ్మా కొట్టారు. ఆ తర్వాత సోనియాకు లేఖ రాసినట్లుగా ప్రకటించారు. రేవంత్ రెడ్డి తనను అవమానిస్తున్నారని ఆయనతో కలిసి వేదిక పంచుకునేందుకు తాను సిద్దంగా లేనని ఆయన చెబుతున్నారు. అయితే ప్రియాంకా గాంధీతో సమీక్షకే డుమ్మా కొట్టడం.. రేవంత్ రెడ్డి ఆయన డిమాండ్ చేసినట్లుగా క్షమాపణ చెప్పినా వెనక్కి తగ్గకపోవడంతో ఉద్దేశపూర్వకంగా ఆయన పార్టీకి దూరం జరుగుతున్నారన్న అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఇక కోమటిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఆయన సమావేశానికి హాజరు కాకపోవడం.. రేవంత్‌ను కారణంగా చూపించడం.. ప్రియాంకా గాంధీని అవమానించినట్లేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్ఆర్‌సీపీ విముక్త ఏపీనే లక్ష్యం - సమయానికి అనుగుణంగా పొత్తులపై నిర్ణయమన్న పవన్ కల్యాణ్ !
రేవంత్‌పై ఫిర్యాదు చేసిన కొంత మంది సీనియర్లు
మరో వైపు ఈ సమావేశంలో కొంత మంది సీనియర్ నేతలు.. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పై ఫిర్యాదు చేసినట్లుగా తెలు్సతోంది. ఒంటెద్దు పోకడలకు పోతున్నారని.. తమను పట్టించుకోవడం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. మునుగోడు అభ్యర్థి ఎంపికపై ప్రియాంకా గాంధీ అభిప్రాయాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఇక కోమటిరెడ్డి లేకుండానే... మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయనుంది.