Nizamabad: పోలీస్ కమిషనరేట్ ముందే ఒంటిపై డీజిల్ పోసుకున్న అన్నదమ్ములు - రెండేళ్ల క్రితం కుల బహిష్కరణ!
రెండు ఎకరాల భూమి విషయంలో కురుమ కులస్తుల మధ్య గొడవ నెలకొంది. రెండు సంవత్సరాలుగా కుల బహిష్కరణకు గురైన హన్మండ్లు, లింగం కుటుంబాల వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ ఘటనకు పాల్పడ్డారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎదుట అన్నదమ్ములు డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. కమిషనరేట్ కార్యాలయం ముందే ఇద్దరూ డీజిల్ పోసుకున్నారు. పక్కనే ఉన్నవారు డీజిల్ డబ్బా లాక్కొని పడేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరులో రెండు కుటుంబాలను గ్రామస్థులు కుల బహిష్కరణ చేశారు. రెండు సంవత్సరాలుగా కుల బహిష్కరణకు గురైన హన్మండ్లు, లింగం కుటుంబాలు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ ఘటనకు పాల్పడ్డాయి.
రెండు ఎకరాల భూమి విషయంలో కురుమ కులస్తుల మధ్య గొడవ నెలకొంది. భూమి విషయంలో నేడు ఉదయం తమపై మరో కుటుంబం దాడి చేసిందని కమిషనర్ ను కలవడానికి కుల బహిష్కరణకు గురైన రెండు కుటుంబాలు వచ్చాయి. న్యాయం చేయాలంటూ సీపీ కార్యాలయంలో డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
నందిపేట్ మండలం సీహెచ్ కొండూరులో భూమి విషయంలో అన్నదమ్ములైన తమను రెండేళ్లుగా కుల బహిష్కరణ చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. కుల బహిష్కరణకు గురైన వారిపైనే వారి కులస్తులు దాడికి దిగారు. తమను అన్యాయంగా బహిష్కరించారని నిజామాబాద్ లోని సీపీ కార్యాలయానికి వచ్చారు.
గతంలో ఓ మహిళ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం
కొద్ది నెలల క్రితమే నిజామాబాద్ కలెక్టరేట్ లో ఈ తరహా ఘటన జరిగింది. ఓ మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు మహిళను అడ్డుకున్నారు. దర్శనం రాణి అనే మహిళ 30 ఏళ్ల క్రితం బంటు పోచమ్మ, పోశయ్య వద్ద పొలం కొనుగోలు చేసింది. బాండ్ పేపర్ పై పెద్దల సమక్షంలో పొలం కొనుగోలు చేశానని బాధితురాలు దర్శనం రాణి తెలిపారు. ఆ పొలం తమదేనంటూ అమ్మినవారు తమను ఇబ్బంది పెడుతున్నారని కలెక్టరేట్ ఎదుట దర్శనం రాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దర్శనం రాణిది బోధన్ మండలం ఆచన్ పల్లి గ్రామం. పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పొలంలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది.
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించేందుకు వచ్చింది ఓ కుటుంబం. వీరిలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లికి చెందిన దర్శనం వాణి ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. 30 ఏళ్ల క్రితం నుంచి సాగుచేసుకుంటున్న రెండు ఎకరాల భూమిని ధరణిలో వేరే వాళ్ల పేరిట పాస్ బుక్ జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామ మాజీ సర్పంచ్ తమపై దాడులకు ప్రయత్నిస్తున్నట్లుగా బాధితులు ఆరోపించారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన చెందారు. తమపై దాడులు చేస్తున్నారని పోలీస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు భూమిని విక్రయించిన వారితో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై భూమి లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు.