మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య మృతి కేసులో ట్విస్ట్- జ్యోతిని వేధించి చంపారని కుటుంబ సభ్యుల ఆరోపణ
మున్సిపల్ కమిషనర్ అయ్యాక తనకు అదనపు కట్నం 5 కోట్లు కావాలని తమ అమ్మాయిని భర్తతోపాటు అత్త, మరిది వేధిస్తున్నరన్నారు జ్యోతి తల్లిదండ్రులు.
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న నల్లమల బాలకృష్ణ సతీమణి మృతి పెద్ద వివాదంగా మారుతోంది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్తింటి వేధింపులు కారణంగా జ్యోతి మృతి చెంది ఉంటుదని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
నల్లమల బాలకృష్ణ సతీమణి జ్యోతి ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో సంచలనంగా మారింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని కమిషనర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టి మృతిరాలి కుటుంబీకులకు సమాచారం అందించారు.
సాయంత్రానికి జ్యోతి మృతదేహాన్ని చూసిన ఆమె కుటుంబ సభ్యులు అది కచ్చితంగా హత్యేనంటూ ఆరోపించారు. ఆమెను చిత్రవద చేసి చంపేశారని ఆరోపించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జ్యోతి మృతి పై అనుమానాలను వ్యక్తం చేస్తు ఆమె తల్లిదండ్రులు, బందువులు క్రోపోదృక్తులు అయ్యారు. మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ కానిస్టేబుల్‌గా ఉన్నప్పుడు బిడ్డను ఇచ్చి వివాహానం చేశామని గుర్తు చేశారు. అప్పడు వివాహ సమయంలో రెండు లక్షల రూపాయలు కట్నంతోపాటు కోటి రూపాయలకుపైగా విలువ చేసే 3 ఎకరాల భూమి రాసి ఇచ్చినట్టు తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ అయ్యాక తనకు అదనపు కట్నం 5 కోట్లు కావాలని తమ అమ్మాయిని భర్తతోపాటు అత్త, మరిది వేధిస్తున్నరన్నారు జ్యోతి తల్లిదండ్రులు. గత మూడు నెలల క్రితం ఇదే విషయంలో గొడవలు జరగ్గా కూతురి జీవితం బాగుండాలని మరొక ఎకరం పొలం కూడా అతనికి రాసి ఇచ్చమని అన్నారు. అయినా తన కూతురితో రోజూ గొడవలు పడుతున్నారని తెలిపారు. నిన్న ఉదయం కూడా జ్యోతి ఫోన్ చేసి తనని చంపేలా ఉన్నారని... తమను రమ్మని చెప్పిందని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.
తాము తమ బిడ్డను చూసేందుకు వస్తుంటే మంచిర్యాల జిల్లాకు చెందినా కొందరు నేతలు మీరు బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద ఆగండి వచ్చి మాట్లాడుతాం అని బెదిరించినట్టు జ్యోతి ఫ్యామిలీ చెబుతోంది. మున్సిపల్ కమిషనర్‌ను కాపాడే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే బాలకృష్ణ సెల్ ఫోన్ సీజ్ చేసి అతన్నీ అతని కుటుంబీకులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణం మేదరివాడలోని ఆదిత్య ఎన్ క్లేవ్ లో మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి వారి ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. బాలకృష్ణ భార్య జ్యోతి మంగళవారం ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి, సిఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో పోలీసు శాఖలో చేసిన బాలకృష్ణ
ఖమ్మం జిల్లాకు చెందిన బాలకృష్ణ గతంలో పోలీసు శాఖలో పని చేశారు. ఆ తర్వాత సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా తొలి పోస్టింగ్ పొందారు. పదోన్నతిపై గ్రేడ్ వన్ కమిషనర్ గా మంచిర్యాలకు వచ్చారు. ఆయన మంచిర్యాల పట్టణం మేదరివాడలోని ఆదిత్య ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్నారు. భార్య భర్తలు తరచూ గొడవ పడేవారని ప్రచారం జరుగుతుంది. బాలకృష్ణ జ్యోతి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. విషయం తెలుసుకున్న జ్యోతి తల్లిదండ్రులు బంధువులు ఖమ్మం జిల్లా నుండి బయలుదేరారు. కుటుంబ సభ్యులు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.