Tiger News: మొన్నటివరకూ హడలెత్తించిన పులి, మూల్ అటవీ ప్రాంతంలో కళేబరంగా లభ్యం
Telangana News | మహారాష్ట్రలోని మూల్ అటవీ ప్రాంతంలో పులి కలేబరం లభ్యమైంది. మొన్నటివరకూ ఓ పులి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలను వణికించింది.

చంద్రపూర్: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా అభయారణ్యంలోని బఫర్ ఏరియా జోన్ లో ఉన్న మూల్ అటవి ప్రాంతంలో పులి కళేబరం లభ్యమయింది. అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న అటవీశాఖ గార్డులు ఈ పులి కళేబరాన్ని గుర్తించారు. వెంటనే వారు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు.
దీంతో విషయం తెలుసుకున్న మూల్ తాలూకా అటవీశాఖ అధికారి ఎస్ఎస్. దూబె నేతృత్వంలోని బృందం ఘటనా స్థలానికి చేరుకొని పులి కళేబరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం పులి కళేబరాన్ని చంద్రపూర్ లోని టీటీసీ కేంద్రానికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించి ల్యాబ్ కు తరలించారు. చనిపోయిన ఈ పులి ఏడేళ్ల వయసున్న ఆడ పులిగా అధికారులు నిర్ధారించారు. ఇది అనారోగ్యంతో మృతి చెందిందని దాని అవయవాలన్నీ సక్రమంగానే ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం స్థానిక అటవీ ప్రాంతంలో ఖననం చేశారు.
ఆసిఫాబాద్ జిల్లాలో
నెల రోజుల కిందట కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోను k8 అనే పులి కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులిని FDPT శాంతారామ్, DFO నీరజ్ కుమార్ టిబ్రీవాల్ స్థానిక అటవీ శాఖ అధికారులు పరిశీలించి విచారణ చేపట్టారు. స్థానికులు ఉచ్చు బిగించి కరెంట్ షాక్ తో చంపినట్లు నిర్ధారించారు. కేసులో 14 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అందులో 9 మంది సూత్రధారులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. కాగజ్ నగర్ కారిడార్ లో ఇలాంటి సంఘటనలు జరగడం అటవి అధికారుల నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని జంతు ప్రేమికులు మండిపడ్డారు. తాజాగా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని మూల్ అటవీ ప్రాంతంలో అనారోగ్యం కారణంగా ఏడేళ్ల ఆడ పులి మరణించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.





















